Site icon HashtagU Telugu

MS Dhoni : ప్రాక్టీస్ లో ధోనీ ధనాధన్

Ms Dhoni

Ms Dhoni

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోని మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ సీజన్ కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ… మహి అప్పుడే ప్రాక్టీస్ షురూ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ వేలం కోసం చెన్నై ఫ్రాంచైజీతో పాటు సన్నాహాల్లో బిజీగా ఉన్న ధోనీ… ప్రాక్టీస్ నూ వదల్లేదు. అటు ఫిట్ నెస్ పైనా దృష్టి పెడుతూ ఇటు ప్రాక్టీస్ లోనూ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా నెట్ ప్రాక్టీస్ లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ధోనీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. దాదాపు రెండు గంటల సేపు ప్రాక్టీస్‌ కొనసాగించిన ధోని ప్రాక్టీస్‌ ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత భారీ సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ధోని ట్రేడ్ మార్క్ హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువసార్లు ఆడాడు.

అటు రిటైర్మెంట్ తర్వాత ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గని మహేంద్రుడు జిమ్ చేస్తూ, టెన్నిస్ ఆడుతూ మరింత జోష్ లో కనిపిస్తున్నాడు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపిన ధోనీ భారీ ఇన్నింగ్స్ లు మాత్రం పెద్దగా ఆడలేదు. దీంతో ఈ సీజన్ లో అభిమానులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ధోని ఆడ‌బోయేది ఇదే ఆఖరి సీజ‌న్ అనే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి రెండు నెల‌లు ముందుగానే ధోని ప్రాక్టీస్ మొద‌లుపెట్టాడ‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ధోని సలహా మేరకు చెన్నై 16 ​కోట్ల రూపాయాలు వెచ్చించి రవీంద్ర జడేజను మొదటి ప్లేయర్‌గా రిటైన్‌ చేసుకుంది. అలాగే ధోనికి 12 కోట్లు, మొయిన్‌ అలీకి 8 కోట్లు, రుతురాజ్‌ గైక్వాడ్‌కు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆదివారం జరగనున్న వేలంలో ఆ ఫ్రాంచైజీ డుప్లెసిస్ , దీపక్ చాహర్ లపై కూడా తీసుకోవాలని భావిస్తోంది.