MS Dhoni: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) కొన్ని కారణాలతో వార్తల్లోకి వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీపై బీసీసీఐ అధికారికి ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ ఫిర్యాదు దాఖలైంది. బీసీసీఐ రూల్ 39 కింద బోర్డు ఎథిక్స్ కమిటీకి ఈ ఫిర్యాదు దాఖలైంది.
అసలు విషయం ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ మౌర్య ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మిహిర్ దివాకర్ అనే వ్యక్తిపై రాంచీలోని సివిల్ కోర్టులో భారత క్రికెటర్ ఎంఎస్ ధోని దాఖలు చేసిన రూ. 15 కోట్ల మోసం కేసుకు సంబంధించినది. దీనికి సంబంధించి ఆగస్ట్ 30లోగా సమాధానం ఇవ్వాలని బీసీసీఐ ఎథిక్స్ కమిటీ ధోనీని కోరింది. దీంతో పాటు సెప్టెంబర్ 16లోగా సమాధానం ఇవ్వాలని రాజేష్ కుమార్ మౌర్యను కూడా కోరింది.
Also Read: WhatsApp: గత వారం రోజుల్లో వాట్సాప్ విడుదల చేసిన ఫీచర్లు ఇవే..!
ధోనిని మోసం చేసింది ఎవరు?
ఎంఎస్ ధోని రాంచీ సివిల్ కోర్టులో మిహిర్ దివాకర్ అనే వ్యక్తిపై మోసం కేసు దాఖలు చేశారు. ఇందులో మిహిర్ దివాకర్‌తో పాటు ధోనీతో వ్యాపారం చేస్తున్న సౌమ్యదాస్, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కూడా మోసం ఆరోపణలు వచ్చాయి. భారత క్రికెటర్‌ను రూ.15 కోట్ల మేర మోసం చేసినట్లు తెలిసింది.
We’re now on WhatsApp. Click to Join.
మార్చి 20, 2024న జరిగిన విచారణలో రాంచీ సివిల్ కోర్టు విషయం సరైనదని నిర్ధారించింది. దీని కారణంగా మిహిర్ దివాకర్, సౌమ్య దాస్, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు సమన్లు పంపారు. ముఖ్యంగా మిహిర్ దివాకర్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడని ధోని ఆరోపించాడు. 2021 సంవత్సరంలో ఒప్పందం గడువు ముగిసింది. అయినప్పటికీ మిహిర్ దివాకర్ కంపెనీ (ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్) ధోనీ పేరును ఉపయోగించడం కొనసాగించింది. ఈ విషయమై ధోనీ తరపు న్యాయవాది దయానంద్ సింగ్ వాదిస్తూ మిహిర్ కంపెనీ దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అకాడమీలను ప్రారంభించిందని అయితే ధోనీకి మాత్రం లాభాల్లో వాటా ఇవ్వలేదని వాదించారు. దీంతో ధోనీకి దాదాపు 15 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు.