Dhoni and CSK: వచ్చే ఏడాది తన రోల్‌పై ధోనీ క్లారిటీ

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ మళ్ళీ గెలుపు బాట పట్టింది. కెప్టెన్సీ మార్పుతో మళ్ళీ పగ్గాలు అందుకున్న ధోనీ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేను గెలిపించాడు. ఎప్పటిలానే తనదైన కూల్ కెప్టెన్సీతో జట్టును విజయవంతంగా లీడ్ చేశాడు.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 12:11 PM IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ మళ్ళీ గెలుపు బాట పట్టింది. కెప్టెన్సీ మార్పుతో మళ్ళీ పగ్గాలు అందుకున్న ధోనీ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేను గెలిపించాడు. ఎప్పటిలానే తనదైన కూల్ కెప్టెన్సీతో జట్టును విజయవంతంగా లీడ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా ధోనీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది చెన్నైకి ఆడతానో లేదో అనే దానిపై క్లారిటీ ఇచ్చేశాడు. నిజానికి ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. 2020 సీజన్‌లో పేలవ ప్రదర్శన తర్వాత ధోనీ తప్పుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాతి ఏడాది జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు ధోనీ. మళ్ళీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా 15వ సీజన్‌లో అడుగుపెట్టే మూడు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వచ్చే ఏడాది ఆడడం డౌటేనన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌తో టాస్ సందర్భంగా కామెంటేటర్ డానీ మారిసన్ ధోనీ రిటైర్మెంట్‌పై ప్రశ్న వేశాడు. రెండేళ్ల కిందట అడిగిన ప్రశ్ననే మరోసారి అడుగుతున్నాను. వచ్చే ఏడాది కూడా నిన్ను ఎల్లో జెర్సీలోనే చూస్తామా అని అడిగాడు.

దీనికి ధోనీ స్పందిస్తూ నేను అప్పుడు చెప్పినట్లే ఇప్పుడూ చెబుతున్నాను. మీరు నన్ను ఎల్లో జెర్సీలోనే చూస్తారు. అయితే అది ఇదే ఎల్లో జెర్సీయా లేక మరో ఎల్లో జెర్సీనా అన్నది వేచి చూడాల్సి ఉంటుందన్నాడు. ధోనీ మాటలను బట్టి ప్లేయర్‌గా కాకపోయినా.. సపోర్టింగ్ స్టాఫ్‌లో అయినా చెన్నైతోనే ధోనీ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి చెన్నై సూపర్‌కింగ్స్‌తో ధోనీకి చాలా అనుబంధం ఉంది. ఆ ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాసన్‌తో వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ధోనీ చెన్నైలోనే కొనసాగడంలో కీలకపాత్ర పోషించింది. ధోనీ ఆటగాడిగా రిటైరయినా ఏదో ఒక రోల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తోనే ఉంటాడని గతంలోనే శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వచ్చే సీజన్‌లో ప్లేయర్‌గా తప్పుకుంటే మాత్రం కోచింగ్ స్టాఫ్‌లో మహి ఖచ్చితంగా ఉంటాడన్నది తేలిపోయింది.

ఇదిలా ఉంటే ధోనీ రిటైరవ్వడంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించిన తర్వాత ఇదే చివరి సీజన్‌గా భావించారు. అయితే రవీంద్ర జడేజా కెప్టెన్సీలో మాత్రం చెన్నై పేలవ ఆటతీరుతో నిరాశపరిచింది. దీంతో సీజన్ మధ్యలో అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకోవడం, ధోనీ మళ్ళీ పగ్గాలు అందుకోవడం జరిగాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ధోనీనే కొనసాగుతుండడంతో రిటైర్మెంట్‌ ప్రకటన ఇప్పట్లో ఉండకపోవచ్చన్నది చాలా మంది మాట. తన స్థానంలో మరో ఆటగాడిని సక్సెస్‌ఫుల్‌గా నియమించిన తర్వాతే ధోనీ ఆటగాడిగా తప్పుకునే అవకాశముంది. ఒకవేళ ప్లేయర్‌గా కాకున్నా చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్ రోల్‌లో ధోనీ కనిపిస్తాడని పలువులు అంచనా వేస్తున్నారు.