Site icon HashtagU Telugu

Suryakumar Yadav: బంగ్లాపై టీమిండియా గెలుపు.. రెండు రికార్డులు ఖాతాలో వేసుకున్న సూర్య‌కుమార్!

ICC T20 Rankings

ICC T20 Rankings

Suryakumar Yadav: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 29 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను తన పేరిట రెండు ప్రత్యేక రికార్డులు న‌మోదు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. అంతేకాకుండా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను వెన‌క్కి నెట్టాడు. అంతేకాకుండా టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.

ముగ్గురు దిగ్గజాలను వెన‌క్కినెట్టాడు

సూర్యకుమార్ యాదవ్ టీ20లో 69 ఇన్నింగ్స్‌ల్లో 2461 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. ఆదివారం సూర్య‌కుమార్ యాదవ్‌ పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ మాలిక్, దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, ఇంగ్లండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్‌లను టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో వెన‌క్కినెట్టాడు.

Also Read: Sri Lanka Election Fever: శ్రీలంక‌పై చైనా ప్ర‌భావం.. ఆ దేశంలో ఎన్నిక‌ల‌కు ముందు భారీగా పెట్టుబ‌డులు!

తొలి టీ20లో భారత కెప్టెన్ 14 బంతుల్లో 29 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. దీంతో టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ను ఈ లిస్ట్‌లో వెన‌క్కి నెట్టాడు. టీ20ల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన‌ జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు.

భారత జట్టు సంచలనం సృష్టించింది

టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులకే పరిమితమైంది. భారత్‌ తరఫున అర్ష్‌దీప్‌, వరుణ్ చెరో మూడు వికెట్లు తీశారు. 128 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి విజ‌యం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భార‌త్ 1-0తో ముందంజ‌లో నిలిచింది. రెండో టీ20 అక్టోబ‌ర్ 9వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

Exit mobile version