Most Expensive Players: ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ రికార్డు సృష్టించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేయడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై కూడా కాసుల వర్షం కురిపించాయి.
వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా
గ్రీన్ – రూ. 25.2 కోట్లు (KKR)
ఆస్ట్రేలియా బ్యాటర్ కామెరూన్ గ్రీన్ కోసం కేకేఆర్, సీఎస్‌కే మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. సీఎస్‌కే రూ. 25 కోట్ల వరకు బిడ్ వేసినప్పటికీ చివరకు కేకేఆర్ రూ. 25.20 కోట్లకు దక్కించుకుంది. దీంతో గ్రీన్ తన స్వదేశీ ఆటగాడు మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
మతీషా పతిరానా – రూ. 18 కోట్లు (KKR)
శ్రీలంక వేగవంతమైన బౌలర్ పతిరానా కోసం కేకేఆర్ రూ. 18 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన శ్రీలంక ఆటగాడిగా పతిరానా రికార్డు సృష్టించాడు.
ప్రశాంత్ వీర్ – రూ. 14.2 కోట్లు (CSK)
యూపీ టీ20 లీగ్ మరియు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను చెన్నై దక్కించుకుంది. రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న ఇతడి కోసం హైదరాబాద్ కూడా రూ. 14 కోట్ల వరకు పోటీ పడింది. రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసే లెఫ్ట్ హ్యాండ్ ఆల్‌రౌండర్‌గా ఇతను సీఎస్‌కేలోకి వచ్చాడు.
Also Read: ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటన.. అనుమానితుడు హైదరాబాద్ వాసి!
కార్తీక్ శర్మ – రూ. 14.2 కోట్లు (CSK)
ప్రశాంత్ వీర్ తరహాలోనే కార్తీక్ శర్మ కోసం కూడా హైదరాబాద్, చెన్నై పోటీ పడ్డాయి. చివరకు రూ. 14.20 కోట్లు వెచ్చించి సీఎస్‌కే ఈ యువ ఆటగాడిని కొనుగోలు చేసింది.
ఆకిబ్ దార్ – రూ. 8.4 కోట్లు (DC)
భారత దేశవాళీ క్రికెట్ స్టార్, ఆల్‌రౌండర్ ఆకిబ్ దార్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ పోటీ పడ్డాయి. చివరకు రూ. 8.40 కోట్లకు ఢిల్లీ అతడిని సొంతం చేసుకుంది. ఇతని బేస్ ప్రైస్ కేవలం రూ. 30 లక్షలు మాత్రమే.
రవి బిష్ణోయ్ – రూ. 7.2 కోట్లు (RR)
లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 7.20 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో లక్నో, పంజాబ్ జట్లకు ఆడిన బిష్ణోయ్‌కు ఇది మూడవ ఐపీఎల్ టీమ్.
వెంకటేష్ అయ్యర్ – రూ. 7 కోట్లు (RCB)
వెంకటేష్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కేకేఆర్ ఇతడికి రూ. 23.75 కోట్లు చెల్లించగా, ఈసారి వేలంలో అతని ధర గణనీయంగా తగ్గి రూ. 7 కోట్లకు చేరుకుంది.
