Site icon HashtagU Telugu

T20 World Cup: పొట్టి క్రికెట్ ఇక్కడ..తగ్గేదే లే..!

ICC

ICC

ప్రపంచ క్రికెట్‌లో గత కొంత కాలంగా ఫాస్ట్ ఫార్మాట్ టీ ట్వంటీలకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఐదు రోజుల పాటు సాగే టెస్టులూ, 8 గంటలకు పైగా జరిగే వన్డేల కంటే మూడు గంటల్లో పలు ట్విస్టులతో ముగిసే పొట్టి క్రికెట్‌కే ఫ్యాన్స్ జై కొడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ధనాధన్‌ క్రికెట్‌ చూసేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఐపీఎల్‌ , బిగ్‌బాష్ వంటి లీగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఆదివారం నుంచి ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా పరిస్థితుల అనంతరం జరుగుతున్న మెగా టోర్నీ కావడంతో.. ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్‌ నెలకొంది.

పెద్దసంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్‌లను వీక్షించేందుకు రానున్నారు. ఇప్పటికే 6 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని ఐసీసీ ప్రకటించింది. నిజానికి టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకే స్టేడియాలు ఫుల్‌గా నిండిపోతాయి. ఈ సారి మాత్రం చాలా మ్యాచ్‌లకూ ఇదే పరిస్థితి ఉండబోతోంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ప్రేక్షకులు స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లు వీక్షించలేకపోయారు. దీంతో ఈ సారి టీ ట్వంటీ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించి ఆస్వాదించేందుకు రెడీ అయ్యారు. పైగా క్రికెట్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉండే ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తుండడం.. అక్కడి ఏర్పాట్లూ, స్టేడియాలూ అత్యాధునిక హంగులతో ఉండడంతో ఇప్పటికే పలు దేశాల ఫ్యాన్స్‌ అక్కడికి చేరుకుంటున్నారు.

మరోవైపు ఈ పొట్టి ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా సహా కొన్ని జట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లతోనే అక్కడ వరల్డ్ కప్ సందడి మొదలైంది. ఆదివారం నుంచి క్వాలిఫైయింగ్ టోర్నీ జరగనుండగా.. సూపర్ 12 మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి షూరు కానున్నాయి. సూపర్‌-12లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది.

కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సిడ్నీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌.. గతేడాది ఫైనల్‌ పోరును తలపించడం ఖాయం. ఇక అక్టోబర్‌ 23న జరిగే మరో మ్యాచ్‌ టోర్నీకే హైలెట్‌గా నిలనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాక్‌ మెల్‌బోర్న్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్లన్నీ నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైపోవడం దాయాదుల సమరానికి ఉన్న క్రేజ్‌ను మరోసారి రుజువు చేసింది.