Mohammed Siraj: కౌంటీ క్రికెట్ లో ఎంట్రీ ఇవ్వనున్న సిరాజ్

క్రికెట్ లో టెస్ట్ ఫార్మాట్ ప్లేయర్ ప్రతిభకు ప్రామాణికంగా చెబుతారు.

  • Written By:
  • Updated On - August 19, 2022 / 11:29 AM IST

క్రికెట్ లో టెస్ట్ ఫార్మాట్ ప్లేయర్ ప్రతిభకు ప్రామాణికంగా చెబుతారు. దీనికి కారణాలు లేకపోలేదు. పరిమిత ఓవర్లతో పోలిస్తే సంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఎంతో ఓపిక కావాలి. బ్యాటర్ అయితే క్రీజులో ఓపిగ్గా నిలదొక్కుకుని ఇన్నింగ్స్ ఆడాలి. బౌలర్ అయితే తన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ ను ఇబ్బంది పెట్టాలి. అందుకే అందరూ టెస్ట్ ఫార్మాట్ లో సుదీర్ఘ కాలం ఆడలేరు. ప్రస్తుతం భారత్ యువ పేసర్ మహ్మద్ సిరాజ్ రెడ్ బాల్ క్రికెట్ పై ఫోకస్ చేశాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్లాన్స్ లో అతను లేకపోవడంతో కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడు.
ఈ మేరకు వార్విక్‌షైర్‌ సిరాజ్ తో ఒప్పందం చేసుకుంది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్‌లో వార్విక్‌షైర్ ఆడనున్న చివరి మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో సిరాజ్ బరిలోకి దిగనున్నాడు.

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా సెప్టెంబర్‌ 12న సోమర్‌సెట్‌తో మ్యాచ్‌కు సిరాజ్ జట్టుతో కలవనున్నాడని వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ పేర్కొంది. ఇక ఇదే విషయం పై సిరాజ్‌ స్పందించాడు. కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఆనుమతి ఇ‍చ్చిన బీసీసీఐకు కృతజ్ఞతలు చెప్పాడు. వార్విక్‌షైర్ వంటి ప్రతిష్టాత్మక క్లబ్‌లో ఆడేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇంగ్లండ్‌లో ఆడడానన్ని తాను ఎప్పుడూ ఆస్వాదిస్తాననీ చెప్పాడు. కాగా ఇంగ్లండ్‌ గడ్డపై సిరాజ్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్‌ ఐదో టెస్టులో సిరాజ్‌ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అలాగే గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సీరీస్ గెలవడంలో
ఈ హైదరాబాదీ పేసర్ కీలక పాత్ర పోషించాడు.