Site icon HashtagU Telugu

Mohammed Siraj: ఆర్సీబీపై గుజరాత్ విజ‌యం.. సిరాజ్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Mohammed Siraj

Mohammed Siraj

Mohammed Siraj: ఐపీఎల్ 2025లో 14వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆర్సీబీతో ఏడేళ్ల అనుబంధం తర్వాత గుజరాత్ జెర్సీలో తన మాజీ జట్టుపై సిరాజ్ ఆడిన తీరు, మ్యాచ్ తర్వాత అతని వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

సిరాజ్ భావోద్వేగ వ్యాఖ్యలు

మ్యాచ్ అనంతరం మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. “మ్యాచ్ సమయంలో నేను కాస్త భావోద్వేగంగా ఉన్నాను. ఆర్సీబీ నుంచి గుజరాత్ టైటాన్స్ జెర్సీలోకి మారడం నాకు కొత్త అనుభవం. కానీ బంతి చేతిలోకి వచ్చిన తర్వాత అంతా సాధారణంగా మారింది” అని అన్నాడు. ఏడేళ్లపాటు ఆర్సీబీ తరపున ఆడిన సిరాజ్ ఎం.చిన్నస్వామి స్టేడియం పిచ్‌ను బాగా అర్థం చేసుకున్నాడు. “నేను విరామం లేకుండా ఆడుతూ వచ్చాను. కానీ బ్రేక్ దొరికినప్పుడు నా తప్పులను సరిదిద్దుకుని, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాను” అని అతను వెల్లడించాడు.

గుజరాత్ ఎంపిక తర్వాత మాస్టర్ ప్లాన్

గుజరాత్ టైటాన్స్ ఆక్షన్‌లో సిరాజ్‌ను ఎంపిక చేసిన తర్వాత అతను జట్టు కోచ్ ఆశిష్ నెహ్రాతో మాట్లాడినట్లు తెలిపాడు. “ఆశిష్ భాయ్ నాకు బౌలింగ్‌ను ఆస్వాదించమని, ఇషాంత్ శర్మ భాయ్ లైన్ అండ్ లెంగ్త్ గురించి సలహా ఇచ్చారు. ఇప్పుడు నా మనస్తత్వం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. పిచ్ ఎలా ఉన్నా నాకు పట్టదు” అని సిరాజ్ తన విజయ రహస్యాన్ని బయటపెట్టాడు.

Also Read: KKR vs SRH: నేడు కోల్‌క‌తా వ‌ర్సెస్ స‌న్‌రైజ‌ర్స్‌.. SRH ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో భారీ మార్పు!

సిరాజ్ బౌలింగ్ మెరుపులు

ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌లను దెబ్బతీశాడు. ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, దేవదత్ పడిక్కల్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పాడు. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతని ఈ ప్రదర్శన గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

మ్యాచ్ వివరాలు

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ 40 బంతుల్లో 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో గుజరాత్ 17.5 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 49 పరుగులు, జోస్ బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. సిరాజ్ ఈ మ్యాచ్‌తో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.