Site icon HashtagU Telugu

West Indies: భారత బౌలర్ల ధాటికి విండీస్‌ 162 పరుగులకే ఆలౌట్‌!

West Indies

West Indies

West Indies: అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌ (West Indies)తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌ జట్టును భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ చేశారు. కరేబియన్ బ్యాటర్లు భారత బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. దీంతో 44.1 ఓవర్లలోనే వారి ఇన్నింగ్స్ ముగిసింది.

వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌

విండీస్ ఓపెనర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే, జాన్ క్యాంప్‌బెల్ (8) స్వల్ప స్కోరుకే తమ వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత కూడా విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

విండీస్ బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేయగలిగారు. వారిలో జస్టిన్ గ్రీవ్స్ (32 పరుగులు, 48 బంతుల్లో, 4 ఫోర్లు) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. షై హోప్ (26 పరుగులు, 36 బంతుల్లో, 3 ఫోర్లు), కెప్టెన్ రోస్టన్ చేజ్ (24 పరుగులు, 43 బంతుల్లో, 4 ఫోర్లు) కొంతవరకు ప్రతిఘటించినా.. మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు విండీస్ బ్యాటింగ్‌ లైనప్ కకావికలమైంది.

Also Read: Indian Cricket: 15 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.. దిగ్గజాలు లేకుండా గ్రౌండ్‌లోకి దిగిన టీమిండియా!

సిరాజ్ హవా.. భారత బౌలర్ల సమిష్టి కృషి

భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి విండీస్ పతనానికి ప్రధాన కారకుడయ్యాడు. తొలి రోజు ఆటలో సిరాజ్ అద్భుతమైన స్వింగ్, వేగంతో విండీస్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఈ టెస్టులో సిరాజ్ కీలకమైన వికెట్లు తీసి ఈ సంవత్సరంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించడం విశేషం. సిరాజ్‌కు తోడుగా జస్‌ప్రీత్ బుమ్రా, ఇతరులు సమష్టిగా రాణించి విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ప్రధాన బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోవడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్ 162 పరుగుల వద్దే ముగిసింది. అనంతరం టీమ్‌ఇండియా తమ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ను ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కనబరిచిన అద్భుత ప్రదర్శన మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధించడానికి సహాయపడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఏ విధంగా కొనసాగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version