Mohammed Siraj: సిరాజ్ కు టిమ్ పైన్ సానుభూతి

ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఎప్పుడు పర్యటించినా గెలుపు,ఓటములు పక్కన పెడితే ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 09:10 PM IST

ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఎప్పుడు పర్యటించినా గెలుపు,ఓటములు పక్కన పెడితే ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. 2008లో మంకీగేట్ వివాదం.. అలాగే 2020-21 పర్యటనలో జాతివివక్ష వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. గత ఏడాది పర్యటనలో టీమిండియా ఆస్ట్రేలియా చారిత్రక విజయం సాధించినా.. ఆ దేశ అభిమానుల అతి అందరినీ అసంతృప్తికి గురి చేసింది. నిజానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు.
అటు స్టాండ్స్‌లో ప్రేక్షకులు కూడా ప్రత్యర్థి ఆటగాళ్ళను మాటలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అయితే ఒక్కోసారి వాళ్ల అతి శృతి మించుతుంది. 2020-21 సిరీస్‌లో భారత జట్టుకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ సిరీస్‌లో భాగంగా సిడ్నీ టెస్ట్‌లో కొందరు ప్రేక్షకులు టీమిండియా పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను టార్గెట్‌ చేస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తాజాగా అప్పటి ఆస్ట్రేలియా టీమ్‌ కెప్టెన్‌ టిమ్‌ పేన్‌ స్పందించాడు. ఈ చారిత్రక సిరీస్‌పై వూట్‌ సెలక్ట్‌ రూపొందించిన బందో మే థా దమ్‌ డాక్యుసిరీస్‌లో పేన్‌ మాట్లాడాడు. ఆ ఘటన జరగాల్సింది కాదని అన్నాడు.

ఆస్ట్రేలియాకు వచ్చే టీమ్స్‌ను చాలా బాగా చూసుకోవడం ఆనవాయితీగా వస్తోందనీ, ఇలాంటివి జరిగినప్పుడు అసంతృప్తి కలుగుతుందన్నాడు. తాను సిరాజ్ దగ్గరకు వెళ్లినప్పుడు అతడు ఏడుస్తూ కనిపించాడని పైన్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఘటన అతన్ని చాలా బాధించడం సహజమేనని, అతడో కుర్రాడు కావడంతో తట్టుకోలేకపోయాడని చెప్పాడు. దీనికి తోడు అంతకుముందే తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నాడని, అప్పుడే ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదని పైన్ వ్యాఖ్యానించాడు. తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారిని బయటకు పంపాల్సిందిగా సిరాజ్‌ డిమాండ్‌ చేయడంలో పూర్తి న్యాయం ఉందని కూడా పైన్ అంగీకరించాడు. సిడ్నీ టెస్ట్‌లో బౌండరీ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న సిరాజ్‌పై కొందరు ప్రేక్షకులు నోరు పారేసుకున్నారు. దీంతో అతడు ఆ విషయాన్ని అప్పటి కెప్టెన్‌ రహానేతోపాటు అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. బుమ్రాతోనూ వాళ్లు ఇలాగే ప్రవర్తించారని కూడా సిరాజ్‌ ఆరోపించాడు. దీంతో స్టేడియం సిబ్బంది కొందరు ఫ్యాన్స్‌ను గుర్తించి వారిని బయటకు పంపించేశారు.