Site icon HashtagU Telugu

Mohammed Shami: కూతురు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎమోష‌న‌ల్ అయిన టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్‌!

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ప్ర‌స్తుతం భార‌త్ జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. రెడ్-బాల్ క్రికెట్‌లో ష‌మీ చాలా సంవత్సరాలుగా ఆడటంలేదు. అలాగే ఐపీఎల్ 2025లో అతని ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేద. ష‌మీ ఫిట్‌నెస్ కూడా ఆశించిన స్థాయిలో కనిపించలేదు. దీని కారణంగా షమీని ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం జట్టులో ఎంపిక చేయలేదు. అదే సమయంలో చాలా కాలంగా తన కూతురు నుండి దూరంగా ఉన్న మహ్మద్ షమీ ఆమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఒక భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశాడు.

కూతురు పుట్టినరోజున షమీ భావోద్వేగ పోస్ట్

మహ్మద్ షమీ కూతురు ఆయిరా షమీ తాజాగా తన 10వ పుట్టినరోజును జరుపుకుంటోంది. అయితే, ఈ సందర్భంగా షమీ తన కూతురితో కలిసి లేడు. ఎందుకంటే అతని భార్య, కూతురు క్రికెటర్ నుండి విడిగా నివసిస్తున్నారు. అయినప్పటికీ తన కూతురిని గుర్తు చేసుకుంటూ షమీ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశాడు.

తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ షమీ ఎమోష‌న‌ల్ అయ్యాడు. “ప్రియమైన కూతురు.. మనం రాత్రంతా మేల్కొని ఉండి, నవ్వుకున్న, నీవు డాన్స్ చేసిన ఆ రాత్రులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నీవు ఇంత త్వరగా పెద్దవుతున్నావని నమ్మలేకపోతున్నాను. నీ జీవితంలో మంచి విషయాలు మాత్రమే కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను ఈ రోజు, ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే” అంటూ రాసుకొచ్చాడు.

Also Read: Praggnanandhaa : కార్ల్‌సన్‌కి షాకిచ్చిన ప్రగ్యానంద.. లాస్‌వేగాస్‌లో సంచలన విజయం

7 సంవత్సరాలుగా షమీ నుండి దూరంగా ఉన్న భార్య, కూతురు

మహ్మద్ షమీ 2014లో హసీన్ జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2015లో హసీన్ జహాన్ ఒక కూతురుకు జన్మనిచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు అంతా సజావుగా సాగింది. కానీ తర్వాత హసీన్ జహాన్ మహ్మద్ షమీపై లైంగిక వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీని కారణంగా షమీ కోర్టు చుట్టూ తిరగవలసి వచ్చింది. 2018లో షమీ, హసీన్ ఒకరి నుండి ఒకరు విడిపోయారు. అయితే వీరిద్దరూ ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇటీవల కొన్ని రోజుల క్రితం కోల్‌కతా హైకోర్టు షమీకి తన భార్య, కూతురు కోసం నెల‌కు 4 లక్షల రూపాయల భరణం చెల్లించాలని ఆదేశించింది.