Moeen Ali Retire: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ (Moeen Ali Retire) ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగే వైట్ బాల్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టులో మొయిన్ ఎంపిక కాలేదు. ఈ కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెలలో స్వదేశంలో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడాల్సి ఉంది. 37 ఏళ్ల మొయిన్ అలీ ఇంగ్లండ్ తరఫున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
2019లో వన్డే ప్రపంచకప్‌ను, 2022లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లిష్ జట్టులో మొయిన్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే మొయిన్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగుతాడని, భవిష్యత్తులో కోచింగ్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నాడు. మొయిన్ ఫిబ్రవరి 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అంటే అతని అంతర్జాతీయ కెరీర్ 10 ఏళ్లపాటు కొనసాగింది.
డైలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొయిన్ అలీ మాట్లాడుతూ.. నా వయస్సు 37 సంవత్సరాలు. నేను ఈ నెలలో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఇప్పుడు తరువాతి తరానికి సమయం ఆసన్నమైంది. నేను రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే సరైన సమయమని నేను భావించాను. నా పని నేను చేసాను అని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌కు ఆడటం చాలా గర్వంగా ఉంది. తొలిసారి ఇంగ్లండ్‌కు ఆడుతున్నప్పుడు ఎన్ని మ్యాచ్‌లు ఆడాలో తెలియదు. కాబట్టి దాదాపు 300 మ్యాచ్‌లు ఆడాను. నా మొదటి కొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ చుట్టూనే గడిచాయి. మోర్గాన్ వన్డే క్రికెట్ బాధ్యతలు స్వీకరించినప్పుడు మరింత సరదాగా మారింది. అయితే టెస్ట్ క్రికెట్ అంటే అసలైన క్రికెట్ అని అలీ తెలిపారు.
మొయిన్ అలీ ఇంగ్లాండ్ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 6678 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 366 వికెట్లు కూడా తీశాడు. మొయిన్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2024 T20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగింది. ఆ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది.
మొయిన్ అలీ అంతర్జాతీయ రికార్డు
- 68 టెస్టులు- 3094 పరుగులు, 204 వికెట్లు
- 138 ODIలు- 2355, 111 వికెట్లు
- 92 టీ20లు- 1229 పరుగులు, 51 వికెట్లు