Moeen Ali Fined: ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీకి ఐసీసీ జరిమానా (Moeen Ali Fined) విధించింది. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మొయిన్ అలీకి ఐసీసీ జరిమానా విధించింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్‌లోకి వచ్చిన మొయిన్ అలీకి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది.
ప్రవర్తనా నియమావళి 2.20ని ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నియమం ఆట స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆటగాళ్ల ప్రవర్తనకు వర్తిస్తుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో రోజు ఆటలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా పడింది. మొయిన్ అలీకి ఐసీసీ ఎందుకు ఈ జరిమానా విధించిందో తెలుసుకుందాం.
Also Read: Yuzvendra Chahal: యుజ్వేంద్ర చహల్ రెడ్ బాల్ ఎంట్రీకి రంగం సిద్ధం?
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 18న మొయిన్ అలీ తన పుట్టినరోజున ICC అతన్ని కఠినంగా శిక్షించింది. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 89వ ఓవర్‌లో బౌండరీపై నిలబడిన మోయిన్ అలీ ఓ తప్పిదం చేశాడు. ఈ విషయంపై చర్యలు తీసుకున్న ఐసీసీ అతడిపై మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఐసీసీ విధించిన ఈ శిక్షను మొయిన్ అలీ కూడా అంగీకరించాడు.
తన చేతులను పొడిగా ఉంచుకోవడం కోసం అతను అంపైర్ల అనుమతి లేకుండా ఓ స్ప్రేను ఉపయోగించడంతో మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. గత 24 నెలల్లో అతను ఇలాంటి తప్పు చేయడం ఇదే తొలిసారి కాబట్టి ఓ డిమెరిట్ పాయింట్‌ను కూడా అలీ ఖాతాలో యాడ్ చేశారు.
2023 యాషెస్ సిరీస్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ నుంచి జో రూట్ రాణించాడు. అతను సెంచరీ సాధించగా, జానీ బెయిర్‌స్టో, జాక్ క్రాలే కూడా 50 పరుగుల మార్కును దాటారు. దీనికి సమాధానంగా ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా అద్భుత సెంచరీ చేయగా ఆస్ట్రేలియా జట్టు 386 పరుగులు చేసి కుప్పకూలింది. దింతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది .