Site icon HashtagU Telugu

Mitchell Starc: మహమ్మద్ షమీ రికార్డు బద్దలు.. చ‌రిత్ర సృష్టించిన‌ స్టార్క్!

Mitchell Starc

Mitchell Starc

Mitchell Starc: ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జ‌ట్ల‌ మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో జరుగుతోంది. మ్యాచ్ మొదటి రోజు రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌లు దారుణంగా విఫలమ‌య్యారు. మొదట సౌతాఫ్రికా బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కంగారూ బౌలర్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడమే కాకుండా రన్స్ కూడా ఇవ్వకుండా నియంత్రించాడు. అంతేకాకుండా మొదటి రోజు 2 వికెట్లు తీసిన స్టార్క్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.

మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు

మొదటి రోజు మిచెల్ స్టార్క్ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌పై విధ్వంసం సృష్టించాడు. స్టార్క్ 7 ఓవర్లలో కేవలం 10 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్‌లోనే ఎయిడెన్ మార్క్‌రమ్‌ను పెవిలియన్‌కు పంపిన స్టార్క్, ఆ తర్వాత రియాన్ రికెల్టన్ వికెట్ తీసి మహమ్మద్ షమీ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. ఇప్పుడు మిచెల్ స్టార్క్ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. స్టార్క్ పేరిట ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 11 వికెట్లు నమోదయ్యాయి. ఇంతకుముందు మహమ్మద్ షమీ 10 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

Also Read: WTC Final: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇదే తొలిసారి!

మొదటి రోజు ఆట సాగిందిలా!

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212 రన్స్‌కే ముగిసింది. ఆస్ట్రేలియా తరపున మొదటి రోజు బ్యాటింగ్‌లో బెవ్‌స్టర్ 72, స్టీవ్ స్మిత్ 66 రన్స్‌తో రాణించారు. అలాగే ఆలెక్స్ కేరీ 23 రన్స్ చేశాడు. సౌతాఫ్రికా తరపున బౌలింగ్‌లో కగిసో రబడా 5, మార్కో జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టారు.

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆరంభం కూడా చాలా దారుణంగా ఉంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా కేవలం 43 రన్స్‌లోనే 4 వికెట్లు కోల్పోయింది. వీరిలో ఎయిడెన్ మార్క్‌రమ్‌ (0), రియాన్ రికెల్టన్ (16 రన్స్), వియాన్ ముల్డర్ (6 రన్స్), ట్రిస్టన్ స్టబ్స్ (2 రన్స్) ఉన్నారు. ప్రస్తుతం కెప్టెన్ టెంబా బావుమా 3 రన్స్, డేవిడ్ బెడింగ్‌హమ్ 8 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.