స్టార్క్ పేస్ కు భారత్ విలవిల.. రెండో వన్డేలో ఆసీస్ ఘనవిజయం

విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా చేతులెత్తేసింది.

  • Written By:
  • Publish Date - March 19, 2023 / 06:16 PM IST

విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా చేతులెత్తేసింది. ఆసీస్ పేసర్ మిఛెల్ స్టార్క్ ధాటికి భారత బ్యాటర్లు విలవిలలాడారు. ఫలితంగా ఈ మ్యాచ్ లో రోహిత్ సేన చిత్తుగా ఓడింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముంబై వన్డే తరహాలోనే భారత టాపార్డర్ ఘోరంగా విఫలమవడం ఆశ్చర్యపరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణయం సరైనదేనని తెలుసుకోవడానికి ఎంతోసమయం పట్టలేదు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ డకౌట్ తో వికెట్ల పతనానికి తెరలేచింది. స్టార్క్ తొలి ఓవర్ నుంచే నిప్పులు చెరిగే పేస్ తో భారత బ్యాటర్లను హడలెత్తించాడు. దీంతో ఊహించని విధంగా టాపార్డర్ లో కోహ్లీ తప్పిస్తే అంతా ఘోరంగా విఫలమయ్యారు. 10 ఓవర్లు కూడా పూర్తి కాక ముందే సగం జట్టు పెవిలియన్ కు చేరింది. ఓపెనర్ శుభమన్ గిల్ డకౌటవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 13 ( 2 ఫోర్లు ) రన్స్ కు ఔటయ్యాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూాడా డకౌటవగా… తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన కెెఎల్ రాహుల్ 9 రన్స్ కు వెనుదిరిగాడు. ఒకవైపు కోహ్లీ ధాటిగా ఆడుతున్నా మిగిలిన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. హార్థిక్ పాండ్యా కూడా 1 పరుగుకే ఔటయ్యాడు. ఫలితంగా భారత్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత కోహ్లీ కాసేపు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించడంతో వికెట్ల పతనానికి బ్రేక్ పడినట్టు కనిపించింది. 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన కోహ్లీని ఎలిస్ ఔట్ చేయడంతో భారత్ ఆరో వికెట్ చేజార్చుకుంది. ఇక్కడ నుంచి భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించడంతో స్కోర్ 100 పరుగులు దాటగలిగింది. ఒకవైపు అక్షర్ ధాటిగా ఆడుతున్నా… మరోవైపు వికెట్ల పతనం ఆగలేదు. దీంతో భారత్ ఇన్నింగ్స్ కు 117 పరుగులకు తెరపడింది. అక్షర్ పటేల్ 29 ( 1 ఫోర్ , 2 సిక్సర్లు ) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5 , ఎబోట్ 3 , నాథన్ ఎలిస్ 2 వికెట్లు పడగొట్టారు.

స్వల్ప టార్గెట్ కావడంతో ఆసీస్ ధాటిగా ఆడింది. తొలి ఓవర్ నుంచే ఆ జట్టు ఓపెనర్లు హెడ్ , మార్ష్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం ఆశ్చర్చపరిచింది. స్టార్క్ , ఎబోట్ అదరగొట్టిన పిచ్ పై మన పేసర్లు సిరాజ్ , షమీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా ఆసీస్ లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబాటు కనిపించలేదు. వీరిద్దరూ తొలి వికెట్ కు అజేయంగా సెంచరీ పార్టనర్ షిప్ నెలకొల్పడం…అది కూడా 11 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసారంటే ఎంత ధాటిగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. హెడ్ , మిఛెల్ మార్ష్ జోరుకు ఆసీస్ 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ 40 ఓవర్ల పాటు కూడా జరగలేదు. భారత్ 26 ఓవర్లలో ఆలౌటైతే… ఆసీస్ 11 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. మిఛెల్ మార్ష్ కేవలం 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 , హెడ్ 30 బంతుల్లో 10 ఫోర్లతో 51 పరుగులు చేశారు. విశాఖ గ్రౌండ్ లో భారత్ కు ఇది రెండో ఓటమి. టీమిండియా భారీస్కోరు సాధించి సిరీస్ గెలుస్తుందని ఆశలు పెట్టుకుని గ్రౌండ్ కు వచ్చిన ఫ్యాన్స్ రోహిత్ సేన ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీస పోటీ కూడా ఇవ్వకుండా మ్యాచ్ లో ఓడిపోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల సిరీస్ ను సిరీస్ ను 1-1 తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి వన్డే బుధవారం చెన్నైలో జరుగుతుంది.