Site icon HashtagU Telugu

CWG Gold Medal: భారత్‌కు తొలి స్వర్ణం… గోల్డ్ గెలిచిన మీరాబాయి చాను

Mirabai Chanu

Mirabai Chanu

కామన్‌వెల్త్‌గేమ్స్‌లో భారత్‌ స్వర్ణాల ఖాతా తెరిచింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ గెలిచింది. మహిళల 49 కేజీల విభాగంలో పోటీ పడిన చాను అంచనాలకు తగ్గట్టే రాణించింది. క్లీన్ అండ్ జెర్క్ మొదటి ప్రయత్నంలో 109 కేజీలు, రెండో ప్రయత్నంలో 113 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో మాత్రం విఫలమైంది. వాస్తవానికి మీరాబాయి చాను క్లీన్ అండ్ జర్క్‌లో మూడో అటెంప్ట్‌లో 115 కేజీల బరువుని ఎత్తేందుకు ప్రయత్నించినా విఫలమైంది. అయినప్పటికీ.. ఫైనల్లో మీరాబాయి చానుని ఎవరూ అధిగమించలేకపోయారు.
తాజా ప్రదర్శనతో ఓవరాల్‌గా చాను కామన్‌వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను పతకం గెలవడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు రజత పతకం గెలుపొందిన మీరాబాయి చాను.. తొలిసారి పసిడిని ముద్దాడింది.

మీరాబాయి చాను పర్సనల్ రికార్డ్ ఈరోజు వరకూ క్లీన్ అండ్ జర్క్‌లో 109 కేజీలు ఉండగా.. 113 కేజీలతో తాజాగా ఆ రికార్డ్‌ని మరింత మెరుగు పర్చుకుంది. భారత్‌కి శనివారం వెయిట్‌లిప్టింగ్‌లో మూడు పతకాలు లభించాయి. తొలుత ఫురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సాగర్ రజత పతకం గెలుపొందగా.. ఆ తర్వాత 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్య పతకాన్ని భారత్‌కి అందించాడు. మీరాబాయి గెలిచిన స్వర్ణంతో పతకాల సంఖ్య మూడుకు చేరింది.