రెజ్లింగ్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లో హింద్ కేసరి ఛాంపియన్ షిప్ ను రెండు సార్లు జరిగేందుకు కృషి చేస్తామని.. రెజ్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అన్ని క్రీడా మైదానాలలో రెజ్లింగ్ క్రీడకు ప్రోత్సహమిస్తామని.. క్రీడా పాఠశాల లో రెజ్లింగ్ క్రీడకు చిన్న వయస్సు నుండే శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక హింద్ కేసరి రెజ్లింగ్ ముగింపు పోటీలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తిలకించారు. అనంతరం విజేతలైన రెజ్లింగ్ క్రీడాకారులకు ‘ గధ’ లను బహుకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ నగరం రెజ్లింగ్, ఫూట్ బాల్, హాకీ, కబడ్డీ లాంటి ఎన్నో క్రీడా అంశాల్లో గతంలో పేరు గడించిందని.. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు రెజ్లింగ్ ను నిర్లక్ష్యం చేశారన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణను క్రీడల్లో అగ్రగామిగా నిలిపేలా స్పోర్ట్స్ పాలసీ ని రూపొందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Hyderabad : తెలంగాణలో రెజ్లింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తాం – మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas goud