MI vs SRH: హోమ్ గ్రౌండ్ లో దుమ్మురేపిన సన్ రైజర్స్.. ముంబైకి రెండో ఓటమి

ఇది కదా మ్యాచ్ అంటే...ఇది కదా విధ్వంసం అంటే...ఇది కదా పరుగుల సునామీ అంటే...ఐపీఎల్ 17వ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత ఊపు తెచ్చింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రికార్డుల మోత మోగిస్తూ ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.

MI vs SRH: ఇది కదా మ్యాచ్ అంటే…ఇది కదా విధ్వంసం అంటే…ఇది కదా పరుగుల సునామీ అంటే…ఐపీఎల్ 17వ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత ఊపు తెచ్చింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రికార్డుల మోత మోగిస్తూ ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ ఫాన్స్ కు పైసా వసూల్ అన్న రీతిలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ దక్కింది. మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మయాంక్ అగర్వాల్ విఫలమైనా.. అభిషేక్ శర్మతో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తర్వాత అభిషేక్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.పియూష్ చావ్లా, కోయిట్జీ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన అతను 16 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక సఫారీ బ్యాటర్ క్లాసెన్ ఊర మాస్ బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. భారీ సిక్సర్లతో ముంబై బౌలర్లను చెడుగుడు ఆడాడు. మరో ఎండ్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్ సైతం రాణించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. తద్వారా ఐపీఎల్ టోర్నీలో భారీ స్కోర్ నమోదు చేసింది. 2013లో ఆర్‌సీబీ నమోదు చేసిన 263/5 స్కోర్ ఇప్పటి వరకు అత్యధికంగా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ అధిగమించింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో నలుగురు హాఫ్ సెంచరీలు చేశారు. హెడ్ 24 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్‌లతో 62, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 63, హెన్రీచ్ క్లాసెన్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 80 నాటౌట్ గా నిలిచాడు.

అసాధ్యమైన టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై కూడా ధాటిగా ఆడింది. రోహిత్ , ఇషాన్ కిషన్ బౌండరీలు బాదినా పవర్ ప్లే లోనే ఔట్ అయ్యారు. అయితే లోకల్ బ్యాటర్ తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 24 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే మిగిలిన వారంతా అనుకున్నంత వేగంగా ఆడలేక పోవడంతో మ్యాచ్ వన్ సైడ్ గానే సాగింది. హార్దిక్ పాండ్య , టిమ్ డేవిడ్ భారీ షాట్లు కొట్టినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. చివరికి ముంబై 20 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు ఇది తొలి విజయం కాగా ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి.

Also Read: MI vs SRH: హోమ్ గ్రౌండ్ లో దుమ్మురేపిన సన్ రైజర్స్.. ముంబైకి రెండో ఓటమి