Site icon HashtagU Telugu

MI vs GT Eliminator: ఉత్కంఠ పోరులో గెలిచిన ముంబై.. టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన గుజ‌రాత్‌!

MI vs GT

MI vs GT

MI vs GT: ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై జట్టు రెండో క్వాలిఫయర్‌లోకి ప్రవేశించింది. అక్కడ ముంబై జ‌ట్టు.. పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై మొదట ఆడుతూ 228 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. దానికి బ‌దులుగా గుజరాత్ చివరి ఓవర్ వరకు ఆడి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై త‌ర‌పున‌ రోహిత్ శర్మ, గుజ‌రాత్ త‌ర‌పున‌ సాయి సుదర్శన్ శక్తివంతమైన అర్ధ సెంచరీలు చేశారు.

రెండో క్వాలిఫయర్‌లో ముంబై

ముంబై ఇండియన్స్ ఇప్పుడు రెండో క్వాలిఫయర్‌కు చేరుకుంది. MI జట్టు క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో జూన్ 1న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. తాజాగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు 228 పరుగుల లక్ష్యం లభించింది. GT జట్టు ఆరంభం చాలా ఘోరంగా ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 1 పరుగుకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్ కలిసి 64 పరుగులు జోడించారు, కానీ మెండిస్ 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. త‌ర్వాత సాయి సుదర్శన్.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ గుజరాత్ విజయాన్ని ఖాయం చేయలేకపోయాడు. సుందర్ 24 బంతుల్లో 48 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.

సుందర్ ఔట్ అయిన తర్వాత గుజరాత్ వెంట‌వెంట‌నే వికెట్లు కోల్పోయింది. షెర్ఫీన్ రూథర్‌ఫోర్డ్ 24 పరుగులు, షారుఖ్ ఖాన్ 13 పరుగులు చేసి ఔట్ అయ్యారు. మరోవైపు రాహుల్ తెవాటియా సెట్ అయినప్పటికీ కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Also Read: TDP Flexi: పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత‌.. ఏ1గా అవినాష్ రెడ్డి పీఏ!

సాయి సుదర్శన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో 49 బంతుల్లో 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ విజయ ఆశలను నిలబెట్టాడు. సుదర్శన్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. అయితే అతని ఈ శక్తివంతమైన ఇన్నింగ్స్రో హిత్ శర్మ 81 పరుగులపై ఆధిపత్యం చెలాయించలేకపోయింది. రోహిత్ 50 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 9 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు.