యావత్ క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ , పాకిస్థాన్ టీ ట్వంటీ సమరానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. సహజంగానే ఈ రెండు జట్లు తలపడినప్పుడు క్రికెట్ ఫీవర్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ సారి టీ ట్వంటీ ప్రపంచకప్ కావడంతో అది రెట్టింపయింది. గత ప్రపంచకప్ లో ఓటమికి భారత్ రివేంజ్ తీర్చుకోవాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
మెగా టోర్నీని విజయంతో ఆరంభించేందుకు రెండు జట్లూ కూడా పట్టుదలగా ఉన్నాయి. అయితే ఆదివారం మెల్ బోర్న్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ పై వరుణుడు నీడలు కమ్ముకున్నాయి. ఆ రోజు వర్షం పడే అవకాశం దాదాపు 80 శాతం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షం అంతరాయం కలిగించకూడదంటూ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు ఫలించే దిశగా అడుగులు పడుతున్నట్టు కనినిపిస్తోంది.
గురువారం, శుక్రవారం కూడా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పినప్పటకీ అదేమీ జరగలేదు. శుక్రవారం వర్షం కురవకపోవడంతో నిర్వాహకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం కూడా మెరుగుపడినట్టు కనిపిస్తోంది. భారత్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణమే ఉంది. దీంతో మ్యాచ్ రోజు కూడా వర్షం పడకూడదని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి.