ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్బోర్న్ టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌పై వివాదం చెలరేగింది. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో యశస్వి బ్యాటింగ్ చేస్తుండగా బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే అంపైర్ యశస్విని నాటౌట్ గా ప్రకటించడంతో కమిన్స్ రివ్యూ కోరాడు. రివ్యూలో జైస్వాల్ నాటౌట్ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ థర్డ్ అంపైర్ మాత్రం దాన్ని అవుట్ గా పరిగణించాడు. దీంతో జైస్వాల్ తన సెంచరీ పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడాడు. జైస్వాల్ అవుట్ పై ఫ్యాన్స్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
రివ్యూలో బంతి యశస్వి బ్యాట్ ని దాటినప్పుడు, స్నికో మీటర్‌లో ఎటువంటి కదలిక లేకపోవడంతో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం బయటపడింది. అంతకుముందు ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని కాదని థర్డ్ అంపైర్ యశస్విని ఔట్ చేశాడు. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. టీమిండియా దిగ్గజాలు సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. స్నికో మీటర్‌లో అంత క్లియర్ గా నాటౌట్ గా చూపిస్తున్నప్పటికీ జైస్వాల్ ని అవుట్ గా పరిగణించడంపై సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు.మరోవైపు టీమిండియా ఫ్యాన్స్ ఆస్ట్రేలియా జట్టుని ఛీటర్స్ గా పేర్కొన్నారు. కొందరు భారత అభిమానులు చీటింగ్ అంటూ ప్లకార్డులు చేతపట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌లలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, అయితే అతను రెండు సార్లు సెంచరీని కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే ఔట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. రెండు సార్లు యశస్వి సెంచరీ మిస్ చేసుకోవడం బాధాకరం. అయితే ఈ టెస్టులో యశస్వి జైస్వాల్ భారీ రికార్డు సృష్టించాడు. జైస్వాల్ ఈ ఏడాది 1478 టెస్టు పరుగులు చేశాడు. దీంతో అతను వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించాడు. భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.2010లో 1562 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 1979లో 1555 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ రెండో స్థానంలో ఉన్నాడు.అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు.