Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

25 ఏళ్ల ఈ కుడిచేతి ఆల్-రౌండర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన బౌలింగ్‌తో పాటు ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా సంచలనం సృష్టించాడు.

Published By: HashtagU Telugu Desk
Akash Choudhary

Akash Choudhary

Akash Choudhary: మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి (Akash Choudhary) ఒక చారిత్రక ప్రదర్శన చేశాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్-గ్రూప్ మ్యాచ్ సందర్భంగా ఆకాష్ ఫస్ట్-క్లాస్ క్రికెట్, రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. సూరత్‌లోని పిథ్వాలా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆకాష్ కేవలం 11 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఆకాష్ ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా మేఘాలయ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 628/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

రికార్డు బద్దలు.. ఎనిమిది వరుస సిక్సర్లు

ఆకాష్ కుమార్ చౌదరి, వెయిన్ వైట్ పాత రికార్డును బద్దలు కొట్టాడు. వైట్ 2012లో ఎసెక్స్‌పై లీసెస్టర్‌షైర్ తరఫున ఆడుతూ 12 బంతుల్లో తన ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఆకాష్ 14 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో ఆకాష్ 126వ ఓవర్‌లో లిమర్ డబీ వేసిన 6 బంతుల్లోనూ వరుసగా సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత ఆకాష్ ఆడిన తర్వాతి రెండు బంతులను కూడా సిక్సర్‌కు పంపాడు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో వరుసగా ఎనిమిది బంతులకు సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌ ఆకాష్ కావడం విశేషం.

రంజీ ట్రోఫీలో రెండవ అరుదైన ఘనత

రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన రెండవ సందర్భం ఇది. దీనికి ముందు 1984-85లో రవిశాస్త్రి తిలక్ రాజ్‌పై ఈ ఘనత సాధించారు. మొత్తం ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒక బ్యాటర్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టడం ఇది మూడవసారి.

మేఘాలయ భారీ స్కోరు

మేఘాలయ మొదటి ఇన్నింగ్స్‌లో అర్పిత్ భటేవరా అత్యధికంగా 273 బంతుల్లో 207 పరుగులు చేశాడు. ఇందులో 23 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ దలాల్, కెప్టెన్ కిషన్ లింగ్దో కూడా శతకాలను నమోదు చేశారు.

Also Read: DSP Richa: భారత క్రికెట్ జట్టు నుంచి మ‌రో కొత్త డీఎస్పీ!

  • రాహుల్ దలాల్: 102 బంతుల్లో 144 పరుగులు (12 ఫోర్లు, 9 సిక్సర్లు).
  • కిషన్ లింగ్దో: 187 బంతుల్లో 119 పరుగులు (14 ఫోర్లు, 1 సిక్సర్).
  • అరుణాచల్ తరఫున టీఎన్ఆర్ మోహిత్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు.

ఆకాష్ చౌదరి కెరీర్ వివరాలు

  • ఆకాష్ కుమార్ చౌదరి ఇప్పటి వరకు 31 ఫస్ట్-క్లాస్, 28 లిస్ట్-ఏ, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
  • ఫస్ట్-క్లాస్: 553 పరుగులు (3 అర్ధ సెంచరీలు), బంతితో 87 వికెట్లు.
  • లిస్ట్-ఏ: 203 పరుగులు (సగటు 15.61, 1 అర్ధ సెంచరీ), 37 వికెట్లు (సగటు 29.24).
  • టీ20: 107 పరుగులు (సగటు 10.70), 28 వికెట్లు (సగటు 26.25).
  • 25 ఏళ్ల ఈ కుడిచేతి ఆల్-రౌండర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన బౌలింగ్‌తో పాటు ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా సంచలనం సృష్టించాడు.
  Last Updated: 09 Nov 2025, 09:18 PM IST