Women’s World Cup: ఆసీస్ చేతిలో భారత మహిళల ఓటమి

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు మరో పరాజయం ఎదురైంది. వరుస విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - March 20, 2022 / 10:07 AM IST

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు మరో పరాజయం ఎదురైంది. వరుస విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలో తడబడినా… తర్వాత పుంజుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ నిరాశపరిచారు. అయితే కెప్టెన్ మిథాలీ రాజ్, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్‌కౌర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. మిథాలీరాజ్ 96 బంతుల్లో 68 , భాటియా 83 బంతుల్లో 59 పరుగులు చేయగా… హర్మన్‌ప్రీత్‌కౌర్ 47 బంతుల్లోనే 57 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచింది. చివర్లో పూజా వస్త్రాకర్ 28 బంతుల్లో 34 రన్స్‌ చేయడంతో భారత్ 7 వికెట్లకు 277 పరుగులు చేయగలిగింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు రేచల్ హేన్స్, అలిస్సా హేలీ మెరుపు ఆరంభాన్నిచ్చారు.

పసలేని భారత బౌలింగ్‌ను ఆటాడుకున్న వీరిద్దరూ తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. వీరిద్దరూ వెంటనే వెంటనే ఔటైనప్పటకీ.. కెప్టెన్ మెగ్‌లానింగ్‌ చెలరేగడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగిపోయింది. మధ్యలో ఎల్లీస్ పెర్రీ 28 , చివర్లో బెత్ మూనీ 30 రన్స్‌తో కెప్టెన్‌కు సపోర్ట్‌గా నిలవడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 49.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఓటమి తప్పలేదు. భారత్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్ళింది. మరోవైపు ఈ ఓటమితో ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌ భారత్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా… భారత్‌ ఐదు మ్యాచ్‌లలో 2 విజయాలు, 3 పరాజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మిథాలీసేన ఇంకా బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లతో ఆడాల్సి ఉండగా.. వీటిలో గెలిస్తే సెమీస్‌కు చేరుతుంది.