T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 నుండి బంగ్లాదేశ్ తప్పుకుంది. ఐసీసీ (ICC) బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించింది. బంగ్లాదేశ్ నిష్క్రమణ తర్వాత పాకిస్థాన్ కూడా తనదైన శైలిలో కొత్త డ్రామాను మొదలుపెట్టింది. వరల్డ్ కప్‌లో పాల్గొనాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆ దేశ ప్రధానమంత్రికి విడిచిపెట్టింది. తాజాగా పీసీబీ (PCB) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. పాకిస్థాన్ ఆడే విషయంపై ఒక కీలక అప్‌డేట్ వెలువడింది.
మొహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియా పోస్ట్ వరల్డ్ కప్‌లో పాల్గొనే అంశంపై మొహ్సిన్ నఖ్వీ జనవరి 26న ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను కలిశారు. అనంతరం ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “ప్రధాని మియా ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్‌తో సానుకూల సమావేశం జరిగింది. ఐసీసీకి సంబంధించిన పూర్తి వ్యవహారాన్ని ఆయనకు వివరించాను. అన్ని ప్రత్యామ్నాయాలను తెరిచి ఉంచుతూనే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధాని ఆదేశించారు. దీనిపై తుది నిర్ణయాన్ని ఈ శుక్రవారం లేదా వచ్చే సోమవారం తీసుకోవాలని నిర్ణయించాము” అని పేర్కొన్నారు.
Also Read: స్టూడెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్!
నఖ్వీ గతంలో ఇచ్చిన ప్రకటన అంతకుముందు జనవరి 24న నఖ్వీ మాట్లాడుతూ.. “మా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం దేశం బయట ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక మేము సంప్రదింపులు జరుపుతాము. ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం. ఒకవేళ ప్రభుత్వం నిరాకరిస్తే, ఐసీసీ పాకిస్థాన్ స్థానంలో మరో జట్టును తీసుకురావచ్చు” అని పేర్కొన్నారు.
అయితే ఈ గందరగోళం మధ్యే జనవరి 25న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్ 2026 కోసం తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మరి పాకిస్థాన్ చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి.
బంగ్లాదేశ్ ఎందుకు తప్పుకుంది?
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ కూడా తన మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడతామని ప్రతిపాదించింది. అయితే ఐసీసీ ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుండి తప్పుకుంది.
