Punjab Kings: మయాంక్ అగర్వాల్ కే పంజాబ్ పగ్గాలు

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే టీమిండియా యువ బ్యాటర్‌ మయాంక్ అగర్వాల్ కు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది.

  • Written By:
  • Publish Date - March 1, 2022 / 09:27 AM IST

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే టీమిండియా యువ బ్యాటర్‌ మయాంక్ అగర్వాల్ కు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేసింది.
గత కొన్ని రోజులుగా పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ అని వార్తలు వస్తున్నప్పటికి.. మయాంక్‌ అగర్వాల్‌వైపే ఫ్రాంచైజీ మొగ్గుచూపింది. . గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ ఈసారి లక్నో సూపర్‌జెయింట్స్‌కు వెళ్లిపోవడంతో ఆ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయక తప్పలేదు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందే మయాంక్‌ అగర్వాల్‌ను రూ.12 కోట్లు, అర్ష్‌దీప్‌ సింగ్‌ ను రూ. 4 కోట్లు చెల్లించి పంజాబ్ రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే..

ఇక బెంగళూరు వేదికగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్ మెగావేలంలో శిఖర్‌ ధావన్‌,రాహుల్‌ చహర్‌, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, కగిసో రబాడ, జానీ బెయిర్‌ స్టో, షారుక్‌ ఖాన్‌ లాంటి స్టార్ ఆటగాళ్లను పంజాబ్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.ప్రస్తుతం జ‌ట్టులో మొత్తంగా 25 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో భార‌త క్రికెట‌ర్‌లు 18 మంది ఉండగా, విదేశీ ఆట‌గాళ్లు ఏడుగురు ఉన్నారు. వీరి కోసం ఫ్రాంఛైజీ రూ. 86 కోట్ల 55 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌లో 2014 సీజన్ లో మాత్రమే ఫైనల్‌ కు చేరగా… మళ్లీ ప్లేఆఫ్స్‌ కు కూడా చేరలేక పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని పట్టుదలగా ఉంది.