ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. డిసెంబర్ 16న జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి తాను తన పేరును నమోదు చేసుకోలేదని ప్రకటించాడు. ఈ నిర్ణయం తన క్రికెట్ కెరీర్‌లో చాలా పెద్దదని, అయితే ఐపీఎల్ తనకు అందించిన అద్భుతమైన అవకాశాలకు, జ్ఞాపకాలకు ఎంతో కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకున్నానని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. “ఐపీఎల్‌లో ఎన్నో మరపురాని సీజన్స్ తర్వాత ఈ ఏడాది వేలంలో నా పేరును రిజిస్టర్ చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఈ లీగ్ నాకు ఇచ్చిన ప్రతిదానికీ ఎంతో కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఒక క్రికెటర్‌గా ఎదిగేందుకు, వరల్డ్ క్లాస్ ప్లేయర్‌లతో ఆడేందుకు, అద్భుతమైన ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించేందుకు ఐపీఎల్ నాకు ఉపయోగపడింది,” అని మ్యాక్స్‌వెల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు హింట్ ఇస్తున్నాయి.
Telangana : ప్రభుత్వ టీచర్లకు వాత పెట్టేందుకు సిద్దమైన విద్యాశాఖ
మ్యాక్స్‌వెల్ తీసుకున్న ఈ నిర్ణయం ఆండ్రీ రస్సెల్ మరియు ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్ నుంచి వైదొలగిన నేపథ్యంలో వచ్చింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోయే అవకాశాలు తక్కువని గ్రహించే మినీ ఆక్షన్‌కు దూరంగా ఉన్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ గత కొన్ని సీజన్లలో పేలవమైన ప్రదర్శన కనబరచడం దీనికి ప్రధాన కారణం. 2012లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన మ్యాక్స్‌వెల్.. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహా మొత్తం నాలుగు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. నాలుగు ఫ్రాంచైజీల తరఫున 141 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, ఆయన కేవలం 23.88 సగటుతో 2819 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ తరఫున గత సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన ఆయన కేవలం 48 పరుగులే చేయడంతో, ఆ జట్టు అతన్ని వేలంలోకి వదిలేయడం జరిగింది.
తన పోస్ట్‌లో మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ అభిమానుల ప్రేమాభిమానాలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “క్రికెట్ అంటే ఎంతో అభిరుచి గల అభిమానుల ముందు ఆడే అవకాశాన్నిచ్చింది. ఐపీఎల్‌లోని జ్ఞాపకాలు, సవాళ్లు, భారత అభిమానుల ఉత్సాహం నాతో శాశ్వతంగా ఉంటాయి. ఇన్నేళ్లుగా మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు. మళ్లీ త్వరలో కలుస్తామని ఆశిస్తున్నాను” అని ఆయన కృతజ్ఞతలు చెప్పాడు. ఒకప్పుడు ‘బిగ్ షో’గా పిలవబడి, విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా ఉన్న మ్యాక్స్‌వెల్, ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. భారీ ధరలకు అమ్ముడైనప్పటికీ, ఆయన ప్రదర్శన అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో, ఫ్రాంచైజీలు ఆయనపై ఆసక్తి చూపకపోవచ్చనే అంచనాతోనే ఆయన వేలం నుంచి తప్పుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఐపీఎల్ చరిత్రలో ఒక శకానికి తెరదించినట్లుగా పరిగణించవచ్చు.
