Rahul Dravid: భారత్ కు షాక్…ద్రావిడ్ కు కరోనా

ఆసియా కప్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కోచ్ రాహుల్ ద్రావిడ్ కోవిడ్ బారిన పడ్డాడు.

  • Written By:
  • Publish Date - August 23, 2022 / 01:15 PM IST

ఆసియా కప్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కోచ్ రాహుల్ ద్రావిడ్ కోవిడ్ బారిన పడ్డాడు. మెగా టోర్నీ జరగనున్న యూఏఈకి టీమ్‌ బయలుదేరడానికి ముందు ద్రవిడ్‌కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో అతడు లేకుండానే భారత్ వెళ్లనుంది. అయితే ద్రావిడ్ ఎప్పుడు టీమ్‌తో చేరతాడన్నది స్పష్టంగా తెలియడం లేదు. ఆసియాకప్‌లోపు ద్రావిడ్ కోలుకోకుంటే వీవీఎస్ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడా అన్నది కూడా తేలాల్సి ఉంది. నిజానికి వెస్టిండీస్‌ టూర్‌ తర్వాత హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌, బౌలింగ్ కోచ్‌ పరాస్‌ మాంబ్రేలకు రెస్ట్‌ ఇచ్చారు. వీళ్లు జింబాబ్వే టూర్‌కు వెళ్లలేదు. ఆ బాధ్యతలను ఎన్సీఏ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ చూసుకున్నాడు. జింబాబ్వే టూర్‌లోనూ టీమిండియా కోచ్‌గా లక్ష్మణే ఉన్నాడు.
ఈ ఏడాది ఐర్లాండ్‌ టూర్‌కు కూడా లక్ష్మణ్‌ తాత్కాలికంగా కోచ్‌ బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ద్రవిడ్‌ సీనియర్‌ టీమ్‌తో కలిసి ఇంగ్లండ్‌లో ఉండటంతో లక్ష్మణ్‌కు తొలిసారి ఆ బాధ్యతలు ఇచ్చారు. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు భారత్ ఆడే ప్రధాన టోర్నీ ఆసియా కప్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. గాయం కారణంగా స్టార్ పేసర్ బూమ్ర ఇప్పటికే ఆసియా కప్ కు దూరమవగా…ఇపుడు ద్రావిడ్ కరోనా బారిన పడడం మరో ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఆసియాకప్‌లో ఆగస్ట్‌ 28న భారత్ , పాకిస్థాన్‌తో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.