Site icon HashtagU Telugu

Virat Kohli: కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్.. తెర వెనుక జ‌రిగింది ఇదేనా?

Virat Kohli

Virat Kohli

Virat Kohli: క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇంగ్లాండ్‌తో జరగాల్సిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. కోహ్లీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడని చాలా మంది అభిమానులు ఇంకా నమ్మలేకపోతున్నారు. మరో మూడు నుంచి నాలుగు ఏళ్లు ఆడే సామర్థ్యం, ఫిట్‌నెస్ అతడికి ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కోహ్లీ రిటైర్మెంట్ వెనుక ఉన్న కారణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవసరం లేదని భావించి ఉండవచ్చు

తాజాగా క్రిక్రాకర్‌తో మాట్లాడిన మనోజ్ తివారీ.. కోహ్లీ నిర్ణయం వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. “తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. భారత జట్టులో తన అవసరం లేదని కోహ్లీ భావించి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఈ విషయం అతడు మాత్రమే చెప్పగలడు. అయితే ఒక వ్యక్తిగా కోహ్లీ చాలా పరిణతి సాధించాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పటికీ బహిరంగంగా వెల్లడించడని నేను అనుకుంటున్నాను” అని తివారీ వ్యాఖ్యానించారు.

Also Read: Raging : శ్రీ చైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ ..ఐరన్ బాక్స్‌తో కాల్చిన తోటి విద్యార్థులు

అందరికీ ఆశ్చర్యం కలిగించిన నిర్ణయం

కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని మనోజ్ తివారీ అన్నారు. “కోహ్లీ ఇంకొక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు సులభంగా ఆడి ఉండేవాడు. అతను శారీరకంగా చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌కు తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం నాతో సహా క్రికెట్ అభిమానులందరికీ చాలా ఆశ్చర్యంగా, షాకింగ్‌గా ఉంది” అని ఆయన అన్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్‌ల నుంచి వైదొలిగినా, వన్డే క్రికెట్‌లో మాత్రం కొనసాగుతాడని తివారీ తెలిపారు.

కోహ్లీ టెస్ట్ కెరీర్

విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ విజయాలతో నిండి ఉంది. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ టీమిండియా తరఫున 123 టెస్ట్ మ్యాచ్‌లలో భాగమయ్యాడు. 210 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 9230 పరుగులు చేశాడు. కోహ్లీ ఖాతాలో 31 అర్ధ సెంచరీలు, 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 254 పరుగులు. అలాగే టెస్ట్ కెరీర్‌లో కోహ్లీ 1027 ఫోర్లు, 30 సిక్సర్లు కొట్టి తన ఆధిపత్యాన్ని చాటాడు. కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత కూడా టెస్ట్ క్రికెట్‌లో అతడి రికార్డులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Exit mobile version