ICC Rule Change:మంకడ్ కాదు ఇకపై అది రనౌట్.. ఐసీసీ కొత్త రూల్స్ ఇవే

వరల్డ్ క్రికెట్ లో పలు నిబంధనలపై ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిలో భాగంగా మన్కడింగ్ ను గతంలోనే అన్ ఫెయిర్ ఔట్ నుంచి మార్చిన ఐసీసీ ఇప్పుడు దాని పేరును కూడా తొలగించింది.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 03:32 PM IST

వరల్డ్ క్రికెట్ లో పలు నిబంధనలపై ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిలో భాగంగా మన్కడింగ్ ను గతంలోనే అన్ ఫెయిర్ ఔట్ నుంచి మార్చిన ఐసీసీ ఇప్పుడు దాని పేరును కూడా తొలగించింది. మంకడ్ ను ఇకపై రనౌట్ గా పిలవాలని సూచించింది. బౌలర్ బంతిని వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజును వదిలి వెళితే అతన్ని ఔట్ చేయడాన్నే మంకడింగ్ గా పిలుస్తారు. పలు సందర్భాల్లో ఈ ఔట్ తీవ్ర చర్చనీయాంశమైంది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమన్న వాదనా వినిపించింది. అయితే ఐసీసీ మాత్రం దీనిని లీగల్ ఔట్ గానే పరిగణిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇకపై దీనిని రనౌట్ గా పిలవనున్నారు. దీనితో పాటు మరికొన్ని ప్రధాన నిర్ణయాలను ఐసీసీ తీసుకుంది. ఒక బ్యాటర్ క్యాచ్ అవుట్ అయినప్పుడు.. క్యాచ్ అవుట్‌కు ముందు బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ అయ్యారా లేదా అనేదానితో సంబంధం లేకుండా.. స్ట్రైకింగ్ కొత్త బ్యాటర్‌కు లభిస్తుంది. ఇదిలా ఉంటే బంతిపై ఉమ్మి రాయడాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. కరోనా తర్వాత బాల్ పై ఉమ్మి రాయడాన్ని నిషేధించగా… ఇకపై పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది.

అలాగే టెస్ట్‌లు, వన్డేలలో కొత్త బ్యాటర్ ఎంత సమయంలో స్ట్రైకింగ్లోకి వచ్చి బాల్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్న నిబంధనలోనూ మార్పు చేసింది. ప్రస్తుతం 90 సెకన్లుగా ఉన్న సమయాన్ని రెండు నిమిషాలుగా మార్పు చేసింది. కాగా ఇకపై మైదానంలో ఫీల్డర్లు కూడా అప్రమత్తంగా ఉండేలా ఐసీసీ రూల్స్ తెచ్చింది. బౌలర్ బౌలింగ్ చేయడానికి పరిగెత్తుతున్నప్పుడు ఫీల్డర్ తప్పుగా కదలాడితే, లేదా ఉద్దేశపూర్వకంగా నిబంధనలు అతిక్రమిస్తే అంపైర్ డెడ్ బాల్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ జట్టుకు పెనాల్టీ విధిస్తూ.. బ్యాటింగ్ జట్టు స్కోరులో అయిదు పరుగులు కలుపుతారని తెలిపింది