Site icon HashtagU Telugu

CWG Cricket: భారత మహిళల చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌

Smriti Mandana

Smriti Mandana

కామన్‌వెల్త్‌ గేమ్స్ క్రికెట్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. రెండో లీగ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 99 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో పాక్‌ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. తొలి ఓవర్‌ నుంచే తడబడుతూ సాగింది. ఓపెనర్ మునీబా అలీ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన పాక్ బ్యాటర్లను భారత బౌలర్లు ఎప్పటికప్పుడు కట్టడి చేశారు. చివరి ఓవర్లలో పరుగులు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం కనబరిచారు. దీంతో ఒత్తిడికి లోనైన పాక్ వరుస వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో స్నేహ రాణా 2 , రాధా యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా…రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మకు ఒక్కో వికెట్ దక్కింది.

ఛేజింగ్‌లో దూకుడుగా ఆడిన భారత మహిళల జట్టు కేవలం 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసింది. షెఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 61 పరుగులు జోడించింది. షెఫాలీ వర్మ 16, మేఘన 14 పరుగులకు ఔటవగా…మంధాన 63, రోడ్రిగ్స్ 2 పరుగులతో జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

ఈ విజయంతో మరోసారి పాక్‌పై భారత్ మరోసారి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై పోరాడి ఓడిన భారత్‌కు టోర్నీలో ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో భారత మహిళల జట్టు సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్ బుధవారం బార్బడోస్‌తో తలపడుతుంది.

Exit mobile version