Site icon HashtagU Telugu

Shreyas Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షాక్ ఇవ్వనున్న అయ్య‌ర్‌.. మ‌రోసారి గాయం..?

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: IPL 2024కి ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) రూపంలో పెద్ద షాక్ త‌గిలేలా ఉంది. ప్ర‌స్తుతం అయ్యర్ విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ముంబై తరపున ఆడుతున్నాడు. టైటిల్ మ్యాచ్‌లో అయ్యర్ రెండవ ఇన్నింగ్స్‌లో ముంబై తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేసి 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 పరుగులు చేశాడు. అయితే ఇక్కడ నుండి అతనికి సమస్య మొద‌లైన‌ట్లు స‌మాచారం.

మీడియా నివేదికల ప్రకారం.. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన అయ్యర్ పాత గాయం మరోసారి తిర‌గ‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది. IPL ప్రారంభానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. అయ్యర్ గాయం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. గాయం కారణంగా అయ్యర్ గత సీజన్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో చివరి ఐదవ రోజున అయ్యర్ మైదానంలో కనిపించలేదని ఓ ప్ర‌ముఖ సంస్థ త‌న నివేదిక‌లో పేర్కొంది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లకు అయ్య‌ర్ దూరం కానున్న‌ట్లు పేర్కొంది.

Also Read: ICC Test Rankings: అశ్విన్ పై జైషా ప్రశంసలు

రంజీ ఫైనల్ నాలుగో రోజు అయ్యర్ మైదానం వదిలి స్కానింగ్ కోసం ఆసుపత్రికి కూడా వెళ్లాడని నివేదిక పేర్కొంది. అతను ఇన్నింగ్స్ సమయంలో రెండుసార్లు వెన్నునొప్పితో బాధపడ్డాడని, దీనికి ముంబై ఫిజియో చికిత్స చేశాడని స‌మాచారం అందుతుంది. అయ్యర్‌కి ఇది పాత గాయం అని, దీనికి అతను గత సంవత్సరం శస్త్రచికిత్స చేయించుకున్నాడని మ‌న‌కు తెలిసిందే.

ఇంగ్లండ్‌తో సిరీస్ స‌మ‌యంలో కూడా గాయం గురించి ఫిర్యాదు

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అయ్యర్ గాయం గురించి ఫిర్యాదు చేసినట్లు కూడా మూలం సమాచారం. అయితే అయ్యర్ గాయానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ఇక అయ్యర్ ఐపీఎల్‌లో మొదటి నుంచి ఆడగలడా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

We’re now on WhatsApp : Click to Join