Ranji Trophy Finals: రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్

రంజీ క్రికెట్ లో తిరుగులేని రికార్డున్న ముంబైకి మధ్యప్రదేశ్ షాక్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 05:44 PM IST

రంజీ క్రికెట్ లో తిరుగులేని రికార్డున్న ముంబైకి మధ్యప్రదేశ్ షాక్ ఇచ్చింది. తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది. ముంబై నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫైనల్ చివరి రోజు కూడా మధ్యప్రదేశ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. రెండో ఇన్నింగ్స్ లో ముంబైని 269 పరుగులకే కట్టడి చేసింది. కుమార్ కార్తికేయ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. నిజానికి ఫైనల్లో ముంబైపై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించడం ద్వారా ఆ జట్టు తొలి రంజీ టైటిల్‌ను ఖరారు చేసుకున్నప్పటకీ మధ్యప్రదేశ్ బౌలర్లు విజయం సాధించే లక్ష్యంతోనే ఆడారు. ముంబై ని ఆలౌట్ చేయడంలో విజయవంతమయ్యారు.

ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకే ఆలౌటవగా…మధ్యప్రదేశ్ 536 రన్స్ చేసి భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఆ జట్టులో ముగ్గురు బ్యాటర్లు శతకాలు సాధించారు. నాలుగో రోజు ఆటలో పాటిదార్‌ ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని తన జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందించాడు. ఇలా చివరి రోజు 108 రన్స్ టార్గెట్ చేదించే క్రమంలో నాలుగు వికెట్లు కోల్పోయినా శుభం శర్మ , రజత్ పాటీదార్ జట్టును గెలిపించారు. రంజీ ట్రోఫీ గెలవడం ఆ జట్టుకు ఇదే తొలిసారి. 1998-99 సీజన్‌లో ఆ జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరినా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా కుప్పకూలి ఓటమిపాలై రన్నరప్‌ తో సరిపెట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ తన టైటిల్ కలను నెరవేర్చుకుంది. శుభం శర్మ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సీజన్ మొత్తం నిలకడగా రాణించిన సర్ఫ్ రాజ్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు దక్కాయి.