LSG vs MI: ముంబైకి మళ్ళీ షాకిచ్చిన లక్నో… ఉత్కంఠ పోరులో 5 రన్స్ తో విజయం

LSG vs MI: ఐపీఎల్ 16వ సీజన్ లో ప్లే ఆఫ్ కు ముందు ముంబై ఇండియన్స్ కు షాక్ తగిలింది.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 12:02 AM IST

LSG vs MI: ఐపీఎల్ 16వ సీజన్ లో ప్లే ఆఫ్ కు ముందు ముంబై ఇండియన్స్ కు షాక్ తగిలింది. హోం గ్రౌండ్ లో అద్భుతమైన ఆటతీరుతో లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. చివర్లో టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్ ఉన్నా…డెత్ బౌలింగ్ తో కట్టడి చేసిన లక్నో ప్లే ఆఫ్ కు చేరువైంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో ఇన్నింగ్స్ లో స్టోయినిస్ హిట్టింగే హైలైట్. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కైల్ మేయర్స్‌ను పక్కన పెట్టేసిన ఆ జట్టు ఓపెనర్‌గా దీపక్ హుడాను దింపింది. అయితే ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. మూడో ఓవర్లో వరుస బంతుల్లో హుడా , ప్రేరక్ మన్కడ్ అవుటయ్యారు. డికాక్ కూడా నిరాశ పరిచాడు. ఈ దశలో
కెప్టెన్ కృనాల్ పాండ్యా స్టొయినిస్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ సెంచరీ పార్టనర్ షిప్ తో లక్నో పుంజుకుంది. 49 రన్స్ చేసిన కృనాల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగినా…స్టొయినిస్‌ రెచ్చిపోయాడు. డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు బాదేసాడు. ఈ మ్యాచ్‌లో స్టొయినిస్‌ 47 బంతుల్లోనే 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే అత్యుత్తమ స్కోరు. దీంతో 150 పరుగులైనా చేస్తుందా అనుకున్న లక్నో జట్టు ఏకంగా 177 పరుగులు చేసింది.

178 పరుగుల లక్ష్య చేధనలో ముంబైకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొలి వికెట్ కు 9.2 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ ఔట్ అయ్యాక ముంబై ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్, వదేర వెంట వెంటనే ఔట్ అవడంతో ముంబై కష్టాల్లో పడింది.
ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విష్ణు వినోద్ కూడా ప్రభావం చూపలేక పోయాడు. అయితే క్రీజులో టిమ్ డేవిడ్ , కామెరూన్ గ్రీన్ ఉండడంతో ముంబై గెలుస్తుందనిపించింది. అయితే లక్నో డెత్ బౌలింగ్ తో మ్యాచ్ మలుపు తిరిగింది. టిమ్ డేవిడ్ భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా ముంబై 172 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.