LSG Beat RR: రాజస్థాన్ జోరుకు లక్నో బ్రేక్… ఉత్కంఠ పోరులో గెలిచిన సూపర్ జెయింట్స్

ఐపీఎల్ 16వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. రాయల్స్ హోం గ్రౌండ్ లోనే లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 11:38 PM IST

LSG Beat RR: ఐపీఎల్ 16వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. రాయల్స్ హోం గ్రౌండ్ లోనే లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. భారీ స్కోర్లు నమోదు కాని ఈ మ్యాచ్ లో లక్నో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ నిదానంగా ప్రారంభించారు. ట్రెంట్ బౌల్ట్ సూపర్ బౌలింగ్‌‌కు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. ఓపెనర్లు ఇద్దరూ ఆచితూచి ఆడటంతో లక్నో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు మాత్రమే చేసింది. క్రమంగా ఈ ఇద్దరూ ధాటిగా ఆడారు. దీంతో 9 ఓవర్లలో లక్నో 74 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్‌ను హోల్డర్ ఔట్ చేసి 82 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ అందుకున్న ఆయూష్ బదోని, దీపక్ హుడా వెంట వెంటనే ఔటయ్యారు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కైల్ మేయర్స్‌ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఒక దశలో వికెట్ కోల్పోకుండా 75 రన్స్ పటిష్టంగా కనిపించిన ఆ జట్టు 104 పరుగులకే లక్నో 4 వికెట్లు కోల్పోయింది. చివర్లో
స్టోయినిస్, నికోలస్ పూరన్ ధాటిగా ఆడటంతో లక్నో 150 దాటగలిగింది. ఆరంభంలో ఓపెనర్లు జిడ్డు బ్యాటింగ్ లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచింది.చివరికి ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలో వికెట్ తీసారు.

టార్గెట్ పెద్దది కాకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. జైస్వాల్ , బట్లర్ తొలి వికెట్ కు 87 పరుగులు జోడించారు. జైస్వాల్ 35 బంతుల్లో 4 ఫోర్లు , 2 సిక్సర్లతో 44 , బట్లర్ 41 బంతుల్లో 40 రన్స్ చేశారు..అయితే వీరిద్దరూ వెంట వెంటనే ఔటవడం , తర్వాత ఫాంలో ఉన్న కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 2 రన్స్ కే వెనుదిరగడంతో రాయల్స్ వరుస వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ హీరో హెట్ మెయిర్ కూడా నిరాశ పరిచాడు.

అయితే ఇంపాక్ట్ ప్లేయర్ పడిక్కల్ క్రీజులో ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.చివర్లో పడిక్కల్ , ద్రువ్ జురెల్ ధాటిగా ఆడి క్రమంలో ఔటయ్యారు. ముఖ్యంగా చివరి ఓవర్ ను అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను గెలిపించాడు. దీంతో రాజస్థాన్ 144 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్ లో ఆ జట్టుకు ఇది రెండో పరాజయం. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 , స్టోయినిస్ 2 వికెట్లు పడగొట్టారు.