LSG vs PBKS: మొహాలీలో రన్ ఫెస్టివల్… రికార్డు స్కోరుతో పంజాబ్ కు లక్నో చెక్

ఐపీఎల్ 16వ సీజన్ లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది.

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 11:32 PM IST

LSG vs PBKS: ఐపీఎల్ 16వ సీజన్ లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ పై రికార్డు స్కోరు నమోదు చేసిన లక్నో 56 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించిన లక్నో బౌలింగ్ లోనూ సత్తా చాటి పంజాబ్ ను కట్టడి చేసింది.
ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ కింగ్స్ బ్యాటింగే హైలైట్ గా చెప్పాలి. బ్యాటింగ్ పిచ్ పై ఆ జట్టు బ్యాటర్లు విధ్వంసమే సృష్టించాడు. ఓపెనర్లు కైల్ మేయర్స్ , కెఎల్ రాహుల్ తొలి వికెట్ కు 3.2 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. రాహుల్ 12 పరుగులకే ఔటైనా…కైల్ మేయర్స్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు.

కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పంజాబ్‌ బౌలర్లను ఉతికారేసిన మేయర్స్‌ ఏడు ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో మేయర్స్‌కు ఇది నాలుగో అర్థసెంచరీ. తర్వాత క్రీజులోకి వచ్చిన మిగిలిన బ్యాటర్లు కూడా రెచ్చిపోయారు. బదౌనీ 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేయగా.. స్టోయినిస్ , నికోలస్ పూరన్ అయితే బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. బంతి పడడమే ఆలస్యం బౌండరీ అవతలకి పంపించడమే లక్ష్యంగా ఆడాడు స్టోయినిస్. ఈ ఆసీస ఆల్ రౌండర్ కేవలం 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 రన్స్ చేశాడు. అటు పూరన్ కూడా కేవలం 19 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 45 రన్స్ చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లకు 257 పరుగులు చేసింది,. ఐపీఎల్ లో ఇది రెండో అత్యధిక స్కోర్. ఈ సీజన్ లోనూ, ఓవరాల్ గా లక్నో జట్టుకూ ఇదే అత్యధిక స్కోర్. లక్నో బ్యాటర్ల దెబ్బకు పంజాబ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలోనే ఓపెనర్లు శిఖర్ ధావన్ , ప్రభ్ సిమ్రన్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అధర్వ , సికిందర్ రాజా మెరుపులు మెరిపించారు. భారీ షాట్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు.వీరిద్దరూ మూడో వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అధర్వ 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 , సికిందర్ రాజా 36 పరుగులు చేశారు. వీరిద్దరూ వెంటవెంటనే ఔటవడం…తర్వాత మిగిలిన బ్యాటర్లు కూడా ధాటిగా ఆడే క్రమంలో వికెట్లు సమర్పించుకున్నారు. లివింగ్ స్టోన్ 23 రన్స్ కు ఔటవగా.. తర్వాత జితేశ్ శర్మ, సామ్ కురాన్ మెరుపు బ్యాటింగ్ చేసినా ఫలితం లేకపోయింది. చివరికి పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 201 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ కు ఇది ఐదో విజయం.