Lucknow Beat Kolkata: లక్నోదే రెండో బెర్త్…కోల్ కధ కంచికి

ఐపీఎల్ 15వ సీజన్ లో రెండో క్వాలిఫైయర్ బెర్తు లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది.

  • Written By:
  • Publish Date - May 18, 2022 / 11:38 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో రెండో క్వాలిఫైయర్ బెర్తు లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది. ఈ ఓటమితో కోల్ కత్తా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా లక్నో బ్యాటింగ్ లో డికాక్ సెంచరీ హైలైట్ గా నిలిస్తే…కే ఎల్ రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గత రెండు వరుస పరాజయాలు తెచ్చిన కసితో కనిపించిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్లు డికాక్ , రాహుల్ చెలరేగిపోయారు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక తొలి వికెట్‌ పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పారు. కోల్‌కతా బౌలర్లను చితకబాదుతూ బౌండరీల మోత మోగించారు. డీకాక్‌ మెరుపు సెంచరీ.. రాహుల్‌ హాఫ్‌ సెంచరీ సాధించడంతో లక్నో 20 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 210 రన్స్‌ సాధించింది. ఇన్నింగ్స్‌ మొత్తం శ్రమించినా కోల్‌కతా బౌలర్లు ఒక్క వికెటూ తీయలేకపోయారు. ఐపీఎల్లో మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్ల పాటు ఒక్క వికెటూ పడకుండా ఆడటం ఇదే తొలిసారి.
డీకాక్‌ కేవలం 70 బంతుల్లోనే 10 సిక్స్‌లు, 10 ఫోర్లతో 140 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. అటు రాహుల్‌ 51 బంతుల్లో 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 68 రన్స్‌ చేసి నాటౌట్‌గా ఉన్నాడు. సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన డికాక్ ధాటికి కోల్ కత్తా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. డికాక్ ఇన్నింగ్స్ లో 100 రన్స్ సిక్సర్లు , బౌండరీలు ద్వారానే వచ్చాయి.

భారీ టార్గెట్ చేదించే క్రమంలో కోల్ కత్తా కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. కాసేపటికే 4 పరుగులు చేసిన అభిజిత్‌ తోమర్‌ ఔటయ్యాడు.
అయితే నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ ధాటిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి కోల్ కత్తా రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఇక్కడ నుంచి కోల్ కతా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో శ్రేయాస్ అయ్యర్ 39 రన్స్ కు ఔటవగా…బిల్లింగ్స్ , రస్సెల్ కూడా నిరాశ పరిచారు. ఇక ఓటమి ఖాయం అనుకున్న దశలో రింకూ సింగ్ , సునీల్ నరైన్ భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. చివరి ఓవర్లో కోల్ కతా విజయం కోసం 21 పరుగులు చేయాల్సి ఉండగా.. రింకూ సింగ్ రెచ్చిపోయాడు. తొలి బంతికి ఫోర్ , రెండు , మూడు బాల్స్ కు సిక్సర్లు బాదాడు. నాలుగో బంతికి రెండు రన్స్ తీయగా…ఇక 2 బంతుల్లో 3 రన్స్ చేయాలి. ఈ దశలో లూయిస్ పట్టిన అద్బుత క్యాచ్ కు రింకూ సింగ్ ఔటవడం…చివరి బాల్ కు ఉమేష్ బౌల్డవడంతో లక్నో రెండు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో లక్నో ప్లే ఆఫ్ కు చేరుకోగా…కోల్ కత్తా ఇంటి దారి పట్టింది.