Lucknow Pitch: లక్నో పిచ్ క్యురేటర్ పై వేటు

టీ ట్వంటీ మ్యాచ్ అంటే అభిమానులు ఫోర్లు , సిక్సర్లు ఆశిస్తారు. వాటి కోసమే స్టేడియానికి వస్తారు.

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 08:47 PM IST

Lucknow Pitch: టీ ట్వంటీ మ్యాచ్ అంటే అభిమానులు ఫోర్లు , సిక్సర్లు ఆశిస్తారు. వాటి కోసమే స్టేడియానికి వస్తారు. అయితే లక్నో వేదికగా జరిగిన భారత్ , కివీస్ మ్యాచ్ మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.బంతి గింగిరాలు తిరిగిన ఈ పిచ్‌పై బ్యాటర్లు 100 పరుగులు చేయడానికి నానా తిప్పలు పడ్డారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ధనాధన్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన టీ20ల్లో ఏమాత్రం ఊహించని స్పిన్ వికెట్‌ను చూసిన ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు, ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.
భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య పిచ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పలువురు మాజీ ఆటగాళ్ళు సైతం విమర్శలు గుప్పించారు.

దీంతో బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. పిచ్ పై యూపీ క్రికెట్ అసోసియషన్ ను వివరణ కోరింది. వెంటనే స్పందించిన యూపీ క్రికెట్ అసోసియషన్
లక్నో పిచ్ క్యురేటర్ పై వేటు వేసింది. గ్వాలియర్ కు చెందిన సంజీవ్ అగర్వాల్ ను కొత్త క్యూరేటర్ గా నియమించారు. మార్చి నుంచి ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో ఆ సమయానికి లక్నో పిచ్ ను మెరుగ్గా చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త బయటకు వచ్చింది.

నిజానికి ఈ మ్యాచ్ కోసం క్యూరేటర్ నల్ల మట్టితో చేసిన రెండు పిచ్ లను రూపొందించాడు.అయితే మ్యాచ్ కు మూడు రోజుల ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ సూచన మేరకు ఎర్ర మట్టి పిచ్ తయారు చేయాల్సి వచ్చింది. సమయం తక్కువగా ఉండటంతో పిచ్ సరిగా కుదరలేదు. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయి ఉంటే పిచ్ వివాదం మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయ పడుతున్నారు.