Site icon HashtagU Telugu

Lucknow Super Giants : లక్నో జట్టు పేరు ఏంటో తెలుసా ?

Tata Ipl

Tata Ipl

లక్నో ఫ్రాంచైజీ తాజాగా తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది.రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా వెంచర్స్‌ లిమిటెడ్‌ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.7,090 కోట్లు వెచ్చించి లక్నో ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. తాజాగా ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా తాజాగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. లక్నో జట్టుకు పేరు ఫిక్స్ చేసేందుకు ట్విట్టర్ వేదికగా ఓ పోల్‌ను నిర్వహించిన ఆర్పీఎస్జీ.. లక్నో ప్రజలే ఆ పేరును సూచించాలని కోరింది. అనంతరం వారి ఇష్టానికి అనుగుణంగానే పేరును ఫిక్స్ చేసింది.

టీమిండియా స్టార్‌ ఆటగాడు, పంజాబ్‌ కింగ్స్‌ మాజీ సారథి కేఎల్‌ రాహుల్‌ ఈ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రాహుల్ కెప్టెన్సీతో పాటు 17 కోట్ల భారీ రెమ్యూనరేషన్‌ను పొందాడు. ఈ క్రమంలో లీగ్‌ చరిత్రలోనే అత్యధి​క ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ గత రెండేళ్లుగా పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టు తరపున అత్యంత నిలకడగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు కూడా రాహులే. దీంతో ఈసారి కూడా అతనిని రిటైన్ చేయాలని పంజాబ్ భావించినా .. రాహుల్ మాత్రం జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు.
రాహుల్‌తో పాటు ఇదివరకే ఎంచుకున్న మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా లక్నో ఫ్రాంచైజీ భారీ ధరనే ఆఫర్‌ చేసింది. ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్, భారత అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలావుంటే లక్నో సూపర్ జెయింట్స్’ జట్టుకు జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ హెడ్ కోచ్‌గా, టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరించనున్నారు.

Exit mobile version