Site icon HashtagU Telugu

లక్నో జట్టు కెప్టెన్ గా కే ఎల్ రాహుల్

Lucknow Ipl

Lucknow Ipl

ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన లక్నో ఫ్రాంచైజీ తన ముగ్గురు ఆటగాళ్లను ప్రకటించింది. ఊహించినట్టుగానే ఈ ఫ్రాంచైజీ భారత జట్టు ఓపెనర్‌ కే ఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసుకుంది. రాహుల్‌తో పాటు పంజాబ్ కింగ్స్ కి ఆడుతున్న లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను , మూడో ఆటగాడిగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను జట్టులోకి తీసుకుంది. లక్నో ఫ్రాంచైజీ 60 కోట్లతో వేలానికి వెళ్లనుండగా… రాహుల్ కోసం 15 కోట్లు , స్టోయినిస్‌కు 11 కోట్లకు , రవి బిష్ణోయ్ కు 4 కోట్లు వెచ్చించింది.రాహుల్ గత రెండేళ్లుగా పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టు తరపున అత్యంత నిలకడగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు కూడా రాహులే. దీంతో ఈసారి కూడా అతనిని రిటైన్ చేయాలని పంజాబ్ భావించినా .. రాహుల్ మాత్రం జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు.

ఇదిలా ఉంటే గత సీజన్‌లో పంజాబ్ తరపున ఆకట్టుకున్న మరో యువ ఆటగాడు రవి బిష్ణోయ్. అండర్-19 ప్రపంచకప్ లో రవి బిష్ణోయ్ అద్భుత ప్రదర్శన కనబరిచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో పంజాబ్ అతన్ని వేలంలో కొనుగోలు చేసింది.తన తొలి సీజన్‌లో బిష్ణోయ్ 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. 2021లో పంజాబ్ తరఫున తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీసుకున్నాడు. పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ బిష్ణోయ్ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకున్న స్టోయినిస్ గత సీజన్లలో బాగానే రాణించాడు. 2015 నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఆ తర్వాత పంజాబ్ , బెంగళూరు జట్లకు ఆడాడు.2020లో మరలా ఢిల్లీకి వచ్చిన స్టోయినిస్ ను ఆ ఫ్రాంచైజీ వేలంలో వదిలేయడంతో లక్నో దక్కించుకుంది.