Site icon HashtagU Telugu

Jonty Rhodes: భారత ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ ?

Jonty Rhodes

Jonty Rhodes

Jonty Rhodes: ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు జాంటీ రోడ్స్…ఏ తరంలోనైనా అతన్ని మించిన ఫీల్డర్ లేరంటే అతిశయోక్తి లేదు. ఎన్నోసార్లు తన అధ్భుతమైన ఫీల్డింగ్ తో సౌతాఫ్రికా జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. మైదానంలో పాదరసంలా కదిలే ప్లేయర్ గా అతనికి పేరుంది. రిటైర్మెంట్ తర్వాత పలు టీ ట్వంటీ లీగ్స్ లో జట్లకు ఫీల్డింగ్ కోచ్ గానూ వ్యవహిరిస్తున్నాడు. తాజాగా జాంటీ రోడ్స్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ గా ఎంపికయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత భారత జట్టు కోచ్ ద్రావిడ్ పదవీకాలం ప్రపంచకప్ తో పూర్తి కానుంది. ఆ తర్వాత బీసీసీఐ కొత్త కోచ్ ను ఎంపిక చేయనుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ముగిసినట్టు సమాచారం. కొత్త కోచ్ గా గంభీర్ ఎంపిక లాంఛనమే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తన సపోర్టింగ్ స్టాఫ్ గా గంభీర్ కొందరిని ఎంపిక చేసుకునేందుకు బీసీసీఐ వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తోంది.

కాగా ఫీల్డింగ్ కోచ్ పదవికి 2019లో కూడా జాంటీ రోడ్స్ అప్లై చేసుకున్నాడు. అయితే అప్పటి టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాత్రం ఆర్.శ్రీధర్ పేరును సిఫార్సు చేసి అతన్నే నియమించుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టి.దిలీప్ భారత్ ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ద్రావిడ్ పదవీకాలంతోనే సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న వారందరికీ గంభీర్ ఉద్వాసన పలికే అవకాశముంది. గతంలో గంభీర్ తో పాటే ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్ గా ఉండడంతో అతన్నే గంభీర్ ఎంపిక చేసుకుంటాడని భావిస్తున్నారు.

జాంటీ రోడ్స్ ఐపీఎల్ లో లక్నో టీమ్ కు ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తుండడంతో పాటు పలు విదేశీ లీగ్స్ లోనూ అదే పొజిషన్ లో ఉన్నాడు. సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ కు కూడా రోడ్స్ ఫీల్డింగ్ కోచ్ గా పనిచేస్తున్నాడు. గతంలో శ్రీలంక క్రికెట్ జట్టుకు తన సేవలందించాడు. రోడ్స్ భారత జట్టు సపోర్టింగ్ స్టాఫ్ లోకి వస్తే టీమిండియా ఫీల్డింగ్ మరింత అత్యుత్తమ స్థాయికి వెళుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read; Infinix Smart 8 Plus: కేవలం రూ. 7వేలకే 50 ఎంపీ కెమెరా.. ఆకట్టుకుంటున్న ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ ఫోన్?

Exit mobile version