Site icon HashtagU Telugu

KKR Collapsed: కుప్పకూలిన కోల్ కత్తా…లక్నో బంపర్ విక్టరీ

de kock

de kock

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికే రాహుల్ రనౌటయ్యాడు. తర్వాత వచ్చిన దీపక్ హుడతో కలిసి డికాక్ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలోనే లక్నో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన డికాక్ ఔటయ్యకా…దీపక్ హుడా 41, కృనాల్ పాండ్యా 25, మార్కస్ స్టోయినీస్ 28 పరుగులతో రాణించారు. చివర్లో హోల్డర్ ఔటైనా.. ఆయుష్ బదోని ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను 170 మార్క్‌ను ధాటించాడు.దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది.కేకేఆర్ బౌల‌ర్ల‌లో ర‌సెల్ 2, సౌథీ, శివ‌మ్ మావి, న‌రైన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత్తా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. లక్నో బౌలర్ల ధాటికి వరుస వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ నుంచే ఆ జట్టు వికెట్ల పతనం ఆరంభమయింది. 25 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో చిక్కుకున్న కేకేఆర్‌ను ఆండ్రీ ర‌సెల్ ఆదుకునే ప్ర‌య‌త్నం చేసినా ఫలితం లేకపోయింది. భారీ షాట్ల‌తో విరుచుకుప‌డుతూ కేకేఆర్‌ను గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేసిన ర‌సెల్ 19 బంతుల్లో 45 పరుగులకు ఔటయ్యడు. రస్సెల్ ఔటయ్యాక కోల్ కత్తా ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు.చివరికి కోల్ కత్తా 14.3 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. లక్నో బౌలర్లలో హోల్డర్ 3 , అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ భారీ విజయంతో లక్నో పాయింట్ల పట్టిక లో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. మరోవైపు కోల్ కత్తా ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

Exit mobile version