SRH Loses Again: అన్నింటా ఫ్లాప్ షో… మళ్ళీ ఓడిన సన్ రైజర్స్

ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తొలి మ్యాచ్ నుంచి ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోని సన్ రైజర్స్ రెండో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది.

  • Written By:
  • Publish Date - April 7, 2023 / 10:54 PM IST

SRH Loses Again: ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తొలి మ్యాచ్ నుంచి ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోని సన్ రైజర్స్ రెండో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది. ఏకపక్షంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త బ్యాటింగ్ తో తీవ్రంగా నిరాశపరిచింది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేదు. అన్మోల్ ప్రీత్ సింగ్ , రాహుల్ త్రిపాఠీ తప్పిస్తే మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ మర్క్ రమ్ ఎంట్రీతో హైదరాబాద్ రాత మారుతుందనుకుంటే అదేమీ జరగలేదు.

మార్క్ రమ్ డకౌటవగా.. మయాంక్ అగర్వాల్ 8 రన్స్ కే ఔటయ్యాడు. ఇక 13 కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ మరోసారి విఫలమయ్యాడు. స్పిన్ బలహీనతను బయటపెట్టుకుంటూ మరోసారి స్టంపౌట్ అయ్యాడు. ఈ సారి సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠీ క్రీజులో ఉన్నా… తన డిఫెన్సివ్ బ్యాటింగ్ తో చిరాకు తెప్పించాడు. సింగిల్స్ తీసేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో సన్ రైజర్స్ రన్ రేట్ నత్తనడకన సాగింది. పిచ్ నుంచి వచ్చిన సపోర్ట్ తో లక్నో స్పిన్నర్లు అదరగొట్టారు. కృనాల్ పాండ్యా 3 వికెట్లు తీయగా… అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్ కూడా చెలరేగారు. చివర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 21 పరుగులు చేయకుంటే స్కోర్ 100 కూడా దాటేది కాదు. లక్నో స్పిన్నర్లకు తలవంచిన సన్ రైజర్స్ 121 పరుగులే చేయగలిగింది.

టార్గెట్ పెద్దది కాకున్నా పిచ్ పై అద్భుతాలు చేస్తారనుకున్న సన్ రైజర్స్ బౌలర్లు కూడా చేతులెత్తేశారు. ఇదే పిచ్ పై లక్నో స్పిన్నర్లు అదరగొడితే… హైదరాబాద్ స్పిన్నర్లు మాత్రం ప్రభావం చూపలేదు. కనీసం లక్నో బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. లక్నో ఓపెనర్లు కైల్ మేయర్స్ , కెఎల్ రాహుల్ తొలి వికెట్ కు 35 పరుగులు జోడించారు. కైల్ మేయర్స్ 13 రన్స్ కే ఔటైనా… రాహుల్ రాణించాడు. దీపక్ హుడా కూడా నిరాశపరిచినా.. అప్పటికే లక్నో విజయం ఖాయమైంది. కృనాల్ పాండ్యా బ్యాట్ తోనూ ఆకట్టుకున్నాడు.

23 బంతుల్లో34 రన్స్ చేసాడు. చివర్లో 3 వికెట్లు చేజార్చుకున్నప్పటికీ… సాధించాల్సిన రన్ రేట్ పెద్దగా లేకపోవడంతో లక్నో సునాయాసంగానే గెలిచింది. ఈ సీజన్ లో లక్నోకు ఇది రెండో విజయం. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన హైదరాబాద్ ఫీల్డింగ్ లోనూ తీవ్రంగా నిరాశపరిచింది. పేలవ బ్యాటింగ్ , బౌలింగే కాదు చెత్త ఫీల్డింగ్ కూడా సన్ రైజర్స్ ఓటములకు కారణంగా చెప్పొచ్చు.