Weightlighting Medal: వెయిట్ లిఫ్టింగ్ లో మరో పతకం

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది.

  • Written By:
  • Updated On - August 6, 2022 / 12:31 PM IST

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. తాజాగా పురుషుల 109 కేజీల కేటగిరీలో ఇండియాకు చెందిన లవ్‌ప్రీత్‌ సింగ్‌ 355 కేజీలు ఎత్తి కాంస్యం గెలిచాడు.ఒక దశలో గోల్డ్‌ మెడల్‌ గెలుస్తాడని అనుకున్నా.. చివర్లో కామెరూన్‌, సమోవా వెయిట్‌ లిఫ్టర్లు అతన్ని వెనక్కి నెట్టారు. లవ్‌ప్రీత్‌ స్నాచ్‌ తొలి ప్రయత్నంలో 157 కేజీలు ఎత్తగా.. మూడో ప్రయత్నంలో అత్యధికంగా 163 కేజీలు ఎత్తాడు.

ఇక క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 185 కేజీలతో మొదలుపెట్టి.. చివరి ప్రయత్నంలో 192 కేజీలు ఎత్తాడు. అతని చివరి ప్రయత్నం సమయానికి లవ్‌ప్రీత్‌ గోల్డ్‌ మెడల్‌ పొజిషన్‌లో ఉన్నాడు. అయితే కామెరూన్‌కు చెందిన న్యాబెయు రెండో ప్రయత్నంలో 201 కేజీలు విజయవంతంగా ఎత్తి మొత్తంగా 361 కేజీలతో అగ్ర స్థానంలో నిలిస్తే సమోవాకు చెందిన ఓపెలోగ్ 358 కేజీలతో రజతం గెలిచాడు. అయితే లవ్‌ప్రీత్‌ తన మొత్తం ఆరు ప్రయత్నాల్లోనూ విజయవంతంగా బరువులను ఎత్తగలిగాడు. లవ్‌ప్రీత్‌ గెలిచిన పతకంతో ప్రస్తుత క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య 14కు చేరింది.

ఒక్క వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే భారత్‌ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్‌ చాను (స్వర్ణం), జెరెమీ లాల్‌రిన్నుంగ (స్వర్ణం), అచింట షెవులి (స్వర్ణం), సంకేత్‌ సర్గార్ (రజతం), బింద్యా రాణి (రజతం), వికాస్‌ ఠాకుర్‌ (రజతం), గురురాజ పుజారి (కాంస్యం), హర్జిందర్‌ కౌర్‌ (కాంస్యం).. తాజాగా లవ్‌ప్రీత్‌ కాంస్యం సాధించారు.