IPL 2022: చెన్నై హ్యాట్రిక్ ఓటమి

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఆ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది.

Published By: HashtagU Telugu Desk
Pbks

Pbks

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఆ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ 54 పరుగుల తేడాతో చెన్నైని నిలువరించింది.మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్, రాజపక్స వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను ధావన్, లివింగ్ స్టోన్ ఆదుకున్నారు. వీరిద్దరూ 9 ఓవర్లలోనే 95 పరుగులు జోడించారు. భారీ షాట్లతో విరుచుకుపడిన లివింగ్ స్టోన్ కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేయగా.. ధావన్ 33 రన్స్ చేశాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లు ధాటిగా ఆడే క్రమంలో పంజాబ్ వరుస వికెట్లు కోల్పోయింది. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయగా.. ప్రిటోరియస్ 2, ముకేశ్ చౌదరి, బ్రావో, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

బ్యాటింగ్ పిచ్ కావడంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ సునాయాసంగా గెలుస్తుందని భావించారు. అయితే పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస వికెట్లు పడగొడుతూ చెన్నైని దెబ్బకొట్టారు. ఊతప్ప 13, గైక్వాడ్ 1 పరుగుకే వెనుదిరగ్గా… మొయిన్ అలీ , రవీంద్ర జడేజా డకౌటయ్యారు. అంబటి రాయుడు కూడా 13 పరుగులకే ఔటవగా.. శివమ్ దూబే , ధోనీ కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దూబే హాఫ్ సెంచరీ చేయగా.. ధోనీ 23 రన్స్ చేశాడు. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో దూబే భారీ షాట్‌కు ప్రయత్నించి 57 పరుగులకు ఔటయ్యాడు. ధోనీ వికెట్ తర్వాత చెన్నై ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. అంచనాలు పెట్టుకున్న బ్రేవో కూడా డకౌవడంతో చెన్నై సూపర్‌కింగ్స్ 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ సీజన్‌లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. కెప్టెన్‌గా జడేజా అంతగా రాణించలేకపోతున్నాడన్న విమర్శలు ఈ మ్యాచ్‌తో మరోసారి రుజువైంది. బౌలింగ్ మార్పులు ఫలించినా… బ్యాటర్లు విఫలమవడంతో చెన్నై విజయావకాశాలను దెబ్బతీసింది. పంజాబ్‌కింగ్స్‌కు ఇది రెండో విజయం.

  Last Updated: 04 Apr 2022, 09:24 AM IST