Punjab Beats Hyderabad: సన్ రైజర్స్ కు పంజాబ్ లాస్ట్ పంచ్

ఐపీఎల్ 15వ సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ముగించింది.

  • Written By:
  • Publish Date - May 22, 2022 / 11:10 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ముగించింది. అన్ని విభాగాల్లో మరోసారి విఫలమైన వేళ సన్ రైజర్స్ ను పంజాబ్ కింగ్స్ సునాయాసంగా ఓడించింది.

ఈ మ్యాచ్‌కు కేన్‌ విలియమ్సన్ దూరం కావడంతో భువనేశ్వర్‌ కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. మూడో ఓవర్లోనే ప్రియమ్‌ గార్గ్‌ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అభిషేక్‌ శర్మ, రాహుల్ త్రిపాఠీ రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఈ సీజన్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ ఒక్కడే మరోసారి ఫర్వాలేదనిపించాడు. అతడు 32 బాల్స్‌లో 43 రన్స్‌ చేశాడు. త్రిపాఠీ 20, మార్‌క్రమ్‌ 21 రన్స్‌ చేశారు. నికొలస్‌ పూరన్‌ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌ 19 బంతుల్లో 25, రొమారియో షెపర్డ్‌ 15 బంతుల్లో 26 రన్స్ చేశారు. దీంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 రన్స్‌ చేసింది. నిజానికి 16వ ఓవర్‌ ముగిసే సమయానికి 5 వికెట్లకు కేవలం 99 రన్స్‌ చేసిన సన్‌రైజర్స్‌ .. డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సాధించింది. ఎలిస్‌ వేసిన 17వ ఓవర్లో 17, రబాడా వేసిన 18వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4 ఓవర్లలో 26 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.

చేజింగ్ లో పంజాబ్ కింగ్స్ కూడా త్వరగానే ఓపెనర్ బెయిర్ స్టో వికెట్ కోల్పోయినా…ధావన్ ధాటిగా ఆడాడు. 32 బంతుల్లో 39 రన్స్ చేయగా… షారుక్ ఖాన్ 19 పరుగులు చేశాడు. మయాంక్ నిరాశపరిచినా …లివింగ్ స్టోన్ అదరగొట్టాడు. సన్ రైజర్స్ బౌలర్లను ఆటాడుకున్న ఈ హిట్టర్ కేవలం 22 బంతుల్లో 5 భారీ సిక్సర్లు , 2 ఫోర్లతో 49 పరుగులు చేశాడు. అటు జితేశ్ శర్మ కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్ 15.1 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది.