Legends Cricket League : మళ్ళీ బ్యాట్ పట్టనున్న దిగ్గజాలు

లెజెండ్స్ క్రికెట్ లీగ్ పేరుతో ఓ మెగా టోర్నీ అభిమానులను అలరించబోతోంది. భారత డాషింగ్ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ , స్పిన్నర్ హర్భజన్ సింగ్ వంటి స్టార్స్ ఈ లీగ్ లో సందడి చేయబోతున్నారు.

  • Written By:
  • Updated On - January 5, 2022 / 09:14 PM IST

లెజెండ్స్ క్రికెట్ లీగ్ పేరుతో ఓ మెగా టోర్నీ అభిమానులను అలరించబోతోంది. భారత డాషింగ్ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ , స్పిన్నర్ హర్భజన్ సింగ్ వంటి స్టార్స్ ఈ లీగ్ లో సందడి చేయబోతున్నారు. ఈ నెల 20 నుండి లెజెండ్స్ క్రికెట్ లీగ్ ఆరంభం కానుండగా.. మూడు జట్లు బరిలో ఉన్నాయి. ఇండియా మహారాజా, ఆసియా ఎలెవన్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్లలో పలువురు దిగ్గజ ఆటగాళ్ళు బరిలోకి దిగుతున్నారు.

సెహ్వాగ్ , యువీ, భజ్జీలతో పాటు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, బద్రీనాథ్ , వేణుగోపాలరావు, మునాఫ్ పటేల్ , సంజయ్ బంగర్ , ఆర్పీసింగ్, నయాన్ మోంగియా, మన్ ప్రీత్ గోనీ , హేమంగ్ బదానీ, ప్రగ్యాన్ ఓజా, నమన్ ఓజా , అమిత్ భండారీ ఇండియా మహారాజా జట్టులో ఉన్నారు. అటు ఆసియా ఎలెవన్ జట్టులో శ్రీలంక, పాకిస్థాన్ జట్లకు చెందిన ప్లేయర్స్ ఆడనున్నారు. షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్, సనత్ జయసూర్య , ముత్తయ్య మురళీధరన్, కమ్రాన్ అక్మల్ , కలువితరణ, చామిందా వాస్, మహ్మద్ హఫీజ్, అజాహార్ మహ్మద్, మహ్మద్ యూసఫ్, ఉమర్ గుల్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ కూడా ఆడుతున్నాడు.

మరోవైపు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీనిలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, విండీస్ , న్యూజిలాండ్ కు చెందిన మాజీ ఆటగాళ్ళు బరిలోకి దిగే అవకాశముంది. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఈ లీగ్ కమిషనర్ గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది రోడ్ సేఫ్టీ సిరీస్ పేరుతో జరిగిన టోర్నీలో సచిన్, సెహ్వాగ్ తో సహా పలువురు దిగ్గజ ఆటగాళ్ళు సందడి చేయగా… ఇప్పుడు అదే తరహాలో ఈ లెజెండ్స్ క్రికెట్ లీగ్ కూడా అభిమానులను అలరిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.