ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక అదరగొట్టింది. ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తద్వారా టెస్ట్ సిరీస్‌ను డ్రా చేయగలిగింది. గాలే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లంక స్పిన్ మాయాజాలానికి ఆస్ట్రేలియా విలవిలలాడింది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్రభాత్ జయసూర్య స్పిన్ దాటికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో లంకను విజయం వరించింది.
అసలు తొలి రెండు రోజుల ఆట చూసిన తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ విజయం సాధిస్తుందని ఎవ్వరూ ఉహించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆసీస్ 364 పరుగులు చేయగా… లంక తడబడి నిలబడింది. దినేశ్ చండిమాల్ డబుల్ సెంచరీతో పాటు కరుణారత్నే, కుశాల్ మెండిస్ , మాథ్యూస్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లంక 554 పరుగులకు ఆలౌటై 190 రన్స్ ఆధిక్యం సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే లంక స్పిన్నర్లు ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తించారు. అంచనాలు పెట్టుకున్న వార్నర్, ఖావాజా , స్మిత్, హెడ్‌లను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపారు.
లబూషేన్, గ్రీన్ పోరాడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ప్రభాత్ జయసూర్య ధాటికి కేవలం ఒక సెషన్‌లోనే ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. లంక బౌలర్లలో జయసూర్య కు ఆరు వికెట్లు దక్కగా మెండిస్, తీక్షణకు తలో రెండు వికెట్లు దక్కాయి. తొలి టెస్టులోనే జయసూర్య ఏకంగా 12 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దినేష్ చండిమాల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఈ టూర్‌లో ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్‌ను గెలవగా… వన్డే సిరీస్‌లో పరాజయం పాలైంది.