Washington Sundar: ఇంగ్లాండ్ కౌంటీల్లో వాషింగ్టన్ సుందర్

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు.

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 08:20 PM IST

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌ దేశవాళీ క్రికెట్‌ కౌంటీ మ్యాచ్‌లు ఆడే ఛాన్స్‌ కొట్టేశాడు. ఈ మేరకు వాషింగ్టన్‌ సుందర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు లంకషైర్‌ జట్టు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

ఈ సందర్భంగా స్వాగత్‌ హై అంటూ సుందర్‌కు ఆహ్వానం పలుకుతూ ఓ వీడియోను షేర్‌ చేసింది. ఇండియన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో లంకషైర్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామనీ, జూలై, ఆగష్టులో జరిగే కౌంటీ చాంపియన్‌షిప్‌ రాయల్‌ లండన్‌కప్‌లో అతడు భాగం కానున్నాడని పేర్కొంది.

ఈ విషయంపై స్పందించిన వాషింగ్టన్‌ సుందర్ తనకు ఈ అవకాశం ఇచ్చిన లంకషైర్‌ మేనేజ్‌మెంట్‌, బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు.గతంలో లంకషైర్ జట్టుకు ఫరూక్‌ ఇంజనీర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సౌరవ్ గంగూలీ, దినేశ్‌ మోంగియా, మురళీ కార్తీక్‌ లాంటి భారత దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు.వారి తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌కు ఈ అవకాశం రాగా.. ప్రస్తుతం వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఆ జాబితాలో చేరాడు.ఐపీఎల్‌ 15వ సీజన్ సందర్భంగా గాయపడిన సుందర్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోగానే లంకషైర్‌ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.