CWG Badminton Gold: బ్యాడ్మింటన్‌లో గోల్డెన్ మండే

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్ భారత షట్లర్లు అదరగొడుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 8, 2022 / 05:47 PM IST

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్ భారత షట్లర్లు అదరగొడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో పివి సింధు స్వర్ణం సాధించగా.. అటు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ కూడా గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో లక్ష్యసేన్ మలేషియాకు చెందిన యోంగ్‌పై 19-21, 21-9, 21-16 తేడాతో విజయం అందుకున్నాడు. లక్ష్యసేన్‌కి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ మెడల్. తొలి గేమ్‌ని 19-21 తేడాతో కోల్పోయిన లక్ష్యసేన్, ఆ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థికి రెండంకెల పాయింట్లు కూడా ఇవ్వలేదంటే ఎంత దూకుడుగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. లక్ష్యసేన్‌ దూకుడుకి మూడో గేమ్‌లో యోంగ్ కాస్త పోటీనిచ్చినా భారత షట్లర్‌దే పూర్తి ఆధిపత్యంగా నిలిచింది.లక్ష్యసేన్ విజయంతో భారత్ ఖాతాలో 20వ స్వర్ణం చేరింది.

ఇప్పటి వరకూ భారత్ 20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు సాధించింది. అంతకుముందు మహిళల సింగిల్స్‌లో పివి సింధు స్వర్ణం కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన తుది పోరులో సింధు కెనడాకి చెందిన మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది. టోర్నీ ఆరంభం నుంచీ తిరుగులేని ఫామ్‌తో ఉన్న సింధు తుది పోరులోనూ తన జోరు కొనసాగించింది. సింధు కెరీర్‌లో ఇది మూడో కామన్‌వెల్త్‌ గేమ్స్ మెడల్‌. అంతకుముందు 2014లో కాంస్యం, 2018లో రజతం గెలిచిన సింధు ఈ సారి తన మెడల్ కలర్‌ను మార్చుకుంది.