Site icon HashtagU Telugu

IPL 2023: డికాక్ ఇక బెంచ్ కే పరిమితమా.. పరుగుల వరద పారిస్తున్న కైల్ మేయర్స్

IPL 2023

Whatsapp Image 2023 04 29 At 6.43.25 Am

IPL 2023: ఐపీఎల్ లో విదేశీ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు వెచ్చిస్తుంటాయి. కొందరు తమపై పెట్టిన మొత్తానికి న్యాయం చేస్తే.. మరికొందరు మాత్రం విఫలమవుతూ ఉంటారు. ఒక్కోసారి తక్కువ రేటుకే కొన్న ప్లేయర్స్ మాత్రం ఫ్రాంచైజీలకు అడ్వాంటేజ్ గా మారిపోతుంటారు. అదే సమయంలో తమ ప్రదర్శనతో జట్టులో అప్పటికే ఉన్న స్టార్ ప్లేయర్స్ ప్లేస్ కే ఎర్త్ పెడుతుంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కు ఎదురైంది.

లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న డికాక్ ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీనికి కారణం కైల్ మేయర్స్… వేలంలో లక్నో ఈ విండీస్ క్రికెటర్ ను దక్కించుకుంది. అయితే డికాక్ సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో లేకపోవడంతో కైల్ మేయర్స్ కు ఓపెనర్ గా లక్నో అవకాశమిచ్చింది. ఈ అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న మేయర్స్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. పవర్ ప్లేలో తన దూకుడైన బ్యాటింగ్ తో చెలరేగిపోతున్న

మేయర్స్ లక్నో భారీస్కోర్లలో కీలకంగా మారిపోయాడు. ఈ సీజన్ లో ఢిల్లీపై కేవలం 38 బంతుల్లోనే 73, చెన్నై పై 22 బంతుల్లో 53, రాజస్థాన్ పై 42 బంతుల్లో 51. తాజాగా పంజాబ్ కింగ్స్ పై 24 బంతుల్లో 54 పరుగులు చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కైల్‌ మేయర్స్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. పంజాబ్‌ బౌలర్లను ఉతికారేసిన మేయర్స్‌ ఏడు ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మేయర్స్ ఫిఫ్టీ కోసం 20 బంతులే ఆడాడు. ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లాడిన మేయర్స్‌ 297 పరుగులు చేశాడు. అయితే కైల్‌ మేయర్స్‌ పరుగుల వరద పారిస్తుండడంతో స్టార్ ప్లేయర్ క్వింటన్‌ డికాక్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. మేయర్స్‌ ను తప్పించే సాహసం లక్నో చేయడం లేదు. ఈ విండీస్ క్రికెటర్ జోరు ఇలాగే కొనసాగితే డికాక్ సీజన్ మొత్తం బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.

Read More: LSG vs PBKS: మొహాలీలో రన్ ఫెస్టివల్… రికార్డు స్కోరుతో పంజాబ్ కు లక్నో చెక్